చిత్రకారిణి నాగలక్ష్మీ కుమారి చిత్రాలు మనల్ని పలకరిస్తాయి…
స్వయంకృషితో పైకి వస్తున్న ఆమెను అభినందిస్తున్నారు…
భర్త ప్రోత్సాహం వల్లనే తనీస్థితికి రాగలిగాను – నాగలక్ష్మీ కుమారి
మచిలీపట్నం :
ఏ వ్యక్తి అయినా ఏ రంగంలోనైనా రాణించాలంటే అందుకు తగిన కృషి, పట్టుదల ఉండాలి. కలలు కంటూ కాలక్షేపం చేస్తూ ఉంటే ఫలితాలు ఉండవు. కొందరు గురువుల దగ్గర శిక్షణ పొందుతూ తాను ఎంచుకున్న రంగంలో విశేషంగా కష్టపడుతూ అనుకున్నది సాధిస్తారు. మరికొందరు గురువుల దగ్గర శిక్షణ పొందే అవకాశం లేనివారు తమంతట తాము పుస్తకాలు చదువుతూ ప్రఖ్యాతిగాంచిన మేధావులను స్ఫూర్తిగా తీసుకొని రాణిస్తారు. అతి తక్కువ కాలంలోనే గుర్తింపు పొందుతారు.
అటువంటి వారిలో బండి కట్ల నాగలక్ష్మీ కుమారి ఒకరు. చిన్నతనం నుంచి ఆమెకు చిత్రలేఖనంపై అభిరుచి. అభిరుచికి అనుగుణంగానే ఇతర చిత్రకారుల బొమ్మలు చూసి అనుకరిస్తూ పెన్సిల్ తో బొమ్మలు వేయసాగారు. పదవ తరగతి వరకు చదువుకున్న నాగలక్ష్మీకుమారికి వివాహం అయింది. ఆ తర్వాత సంసారం, బాధ్యతలు. భర్త బండి కట్ల సుష్మణాచారి, భార్య అభిరుచిని గమనించి అప్పటివరకు ఆమె చిత్రీకరించిన బొమ్మలను చూసి ప్రోత్సహించాలన్న నిర్ణయం తీసుకున్నారు.

అప్పటినుంచి భార్యకు కావలసిన పెన్సిళ్లు, రంగులు, కాగితాలు, కార్డు బోర్డు అన్నీ సమీకరించి వెన్నంటి ఉంటూ వచ్చారు. నాగలక్ష్మీ కుమారి భర్త సుష్మణాచారి వడ్రంగి పనిచేస్తూ, తన పనిలో బిజీగా ఉన్న భార్యను ప్రతిరోజూ ఈరోజు ఏ ఏ బొమ్మలు వేశావు.. ఇంకేం బొమ్మలు వేయాలనుకుంటున్నావు.. ఏ రంగులు కావాలి అంటూ అడిగి, కావలసిన వాటిని విజయవాడ నుంచి కొనుగోలు చేసి తీసుకొచ్చేవారు. ఆ దంపతులు మచిలీపట్నంలో ఉంటుండడంతో నాగలక్ష్మీ కుమారికి కావలసిన రంగులు మచిలీపట్నంలో దొరికేవి కావు. ఒక్కోసారి సుష్మణాచారి భార్యను తీసుకొని విజయవాడకు వెళ్లి రంగులు కొనుక్కుని వచ్చేవారు.
హాయిగా సాగుతున్న వారి కుటుంబంలో ఒక్కసారిగా పెను చీకటి చోటు చేసుకుంది. చదువుకుంటున్న ఏడు సంవత్సరాల వాళ్ళ బాబును పాము కాటు వేయడంతో చనిపోయాడు. ఒక బాబు, ఒక పాపతో సంతోషంగా ఉంటున్న ఆ కుటుంబంలో బాబు చనిపోవడంతో ఈ లోకమంతా నాగలక్ష్మీ కుమారికి దూరమైనట్లయింది. బాబు ఆలోచనలతో, దిగులుతో మానసికంగా కృంగిపోయింది. అనారోగ్యం పాలయింది. వేళకు తిండి లేదు, చిత్రాల సరంజా అంతా మూలకు వెళ్లిపోయింది. “ఇక ఇంతే ఈ జీవితం!” అనుకుంది.
తన కళ్ళేదుట కటిక నేల మీద కూర్చుని చిత్రాలు గీసే భార్య నిర్జీవంగా ఉండటం తట్టుకోలేని భర్త, కుమార్తె తల్లడిల్లిపోయారు మళ్ళీ లక్ష్మీకుమారిని మామూలు మనిషిని చేసి, చిత్రాలు వేసే విధంగా ప్రోత్సహించాలని గతాన్ని మర్చిపోయే విధంగా తీర్చిదిద్దాలనుకున్నారు.
నెమ్మదిగా ఆమె ఆరోగ్యం కుదుట పడసాగింది. అల్లికలతో బుట్టలు అల్లడం, మిషన్ కుట్టడం.. ఇలా రోజులు గడుస్తుండగా భర్త, కుమార్తె నాగ లావణ్యలు ప్రత్యేక శ్రద్ధ తీసుకోగా మళ్లీ చిత్రాలు గీయడానికి ఆసక్తి కనపరచసాగింది.
ఇప్పుడు నాగలక్ష్మీ కుమారి తనలో దాగివున్న సృజనాత్మక శక్తితో అనేక చిత్రాలను గీయడం మొదలుపెట్టారు. ఆర్ట్ ఎగ్జిబిషన్లో తన చిత్రాలను ప్రదర్శించడం మొదలుపెట్టారు. నాలుగు, ఐదు సంవత్సరాలలో చిత్రకారిణిగా 300కు పైగా చిత్రాలు గీశారు. ఎక్కువగా ఆమె చిత్రాలు దేవుళ్ళవే కాకుండా ప్రకృతి రమణీయంతో కూడుకున్న చిత్రాలు కూడా ఉండటం విశేషం. సొంతంగా తనకు తాను తీర్చిదిద్దుకున్న చిత్రకారిణి నాగలక్ష్మీకుమారి. ప్రస్తుతం ఆర్ట్ లో డిప్లమో చేస్తున్నారు. మూడు సంవత్సరాల కోర్సులో ఇప్పుడు ఆఖరి సంవత్సరం గడుస్తోంది.

చిత్రకళా ప్రదర్శనలో ఔత్సాహికరాలినైన తన చిత్రాలను పలువురు చూసి ప్రశంసిస్తున్నారు.. అభినందిస్తున్నారు. ఆమె చిత్రాలు మనల్ని పలకరిస్తాయి. చూసిన వెంటనే ఆకట్టుకుంటాయి. ఒక చిత్ర కళాకారుణికి అంతకంటే ఇంకేం కావాలి.
వారి మనవడు త్రిలోక్ పదవ తరగతి చదువుతున్నాడు. మనవరాలు రాధా అక్షయ మూడవ తరగతి చదువుతోంది. ఆ ఇద్దరు పలు చిత్రకళ పోటీలలో పాల్గొని బహుమతులు పొందుతూ ఆశీస్సులు అందుకుంటున్నారు. చిత్రకారిణి బండికట్ల నాగలక్ష్మీ కుమారి (55) మరింతగా రాణించి ఇంకా ఇంకా పేరు ప్రఖ్యాతులు పొందాలని ఆశిద్దాం.
నందం రామారావు
మచిలీపట్నం
9393921025

