చట్టాల పై ప్రజలకు అవగాహన కల్పించేందుకే జన చైతన్యం- ఎస్ఐ వేమన చందన
ఘంటసాల :
సోమవారం ఘంటసాల మండలం కొడాలి గ్రామంలో జన చైతన్యం అవగాహన కార్యక్రమాన్ని ఘంటసాల ఎస్ఐ వేమన చందన నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్ఐ చందన మాట్లాడుతూ ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని, నాలుగు చక్రాల వాహనదారులు సీటు బెల్ట్ వినియోగించాలని సూచించారు. మైనర్ డ్రైవింగ్, రాంగ్ సైడ్ డ్రైవింగ్, మధ్యం సేవించి వాహనాలు నడపడం వంటి ప్రమాదకర చర్యల వల్ల కలిగే అనర్ధాలను వివరించి ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నియమాలను పాటిస్తూ సురక్షితంగా ప్రయాణించాలన్నారు.
సైబర్ నేరాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. తెలియని వ్యక్తులకు ఓటీపీలు, బ్యాంకు వివరాలు, వ్యక్తిగత సమాచారం ఇవ్వకూడదన్నారు. ఆన్లైన్ మోసాలకు గురైతే వెంటనే డయల్ 1930కు ఫిర్యాదు చేయాలని, అత్యవసర పరిస్థితుల్లో డయల్ 112 సేవలను వినియోగించుకోవాలన్నారు. సోషల్ మీడియా వినియోగంలో జాగ్రత్తలు పాటించాలని. ఫేక్ లింకులు, మోసపూరిత యాప్ల పట్ల అప్రమత్తంగా ఉండాలన్నారు. గంజాయి, ఇతర మాదక ద్రవ్యాల వినియోగం వల్ల యువత భవిష్యత్తు నాశనం అవుతుందన్నారు. మాదకద్రవ్యాలకు దూరంగా ఉండాలని సూచించారు. మహిళలు, చిన్నారుల పై జరిగే నేరాలు, ఫోక్సో చట్టం, శక్తి యాప్ ఉపయోగాలు, గుడ్ టచ్ – బ్యాడ్ టచ్ వంటి అంశాల పై తెలియజేసి మహిళల భద్రత కోసం పోలీసు శాఖ ఎల్లప్పుడు అందుబాటులో ఉంటుందని తెలియజేశారు.
ప్రజలు పోలీసులకు సహకరించి సమాజంలో శాంతి భద్రతల పరిరక్షణకు భాగస్వాములు కావాలని ఎస్ఐ చందన విజ్ఞప్తి చేశారు.

