తీవ్ర తుపాను హెచ్చరిక: కృష్ణా జిల్లా యంత్రాంగం అప్రమత్తం
మచిలీపట్నం:
తూర్పు మధ్య బంగాళాఖాతం, దానికి ఆనుకుని ఉన్న ఆగ్నేయ బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం ఏర్పడింది. ఇది అక్టోబర్ 24న వాయుగుండంగా, అక్టోబర్ 25న తీవ్ర వాయుగుండంగా మారి, అక్టోబర్ 26వ తేదీ ఉదయానికి పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో తుపానుగా మారే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ (IMD) వెల్లడించింది. ఈ తుపాను మరింత బలపడుతూ పశ్చిమ-వాయువ్య దిశగా కదిలి, అక్టోబర్ 28వ తేదీ ఉదయానికి ఆంధ్రప్రదేశ్ తీరానికి సమీపంలోకి చేరుకునే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.
తీరప్రాంతాలు, లోతట్టు ప్రాంతాల అధికారులకు ఆదేశాలు
తుపాను ప్రభావం నేపథ్యంలో కృష్ణా జిల్లాలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తు జాగ్రత్త చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ సంబంధిత అధికారులను ఆదేశించారు. ముఖ్యంగా తీరప్రాంతాలు, లోతట్టు ప్రాంతాలు, వరద ముంపునకు గురయ్యే అవకాశమున్న ప్రాంతాల్లో ప్రత్యేక అప్రమత్తత వహించాలని సూచించారు.
కంట్రోల్ రూమ్‌ల ఏర్పాటు
అత్యవసర పరిస్థితుల్లో ప్రజలకు తక్షణ సహాయ సహకారాలు అందించేందుకు వీలుగా జిల్లా కలెక్టరేట్‌తో పాటు అన్ని రెవెన్యూ డివిజనల్ అధికారుల కార్యాలయాలు , తహశీల్దారు కార్యాలయాల్లో కంట్రోల్ రూమ్‌లను ఏర్పాటు చేస్తున్నట్లు జిల్లా యంత్రాంగం తెలిపింది. సంబంధిత అధికారులు నిరంతరం అందుబాటులో ఉంటూ వాతావరణ పరిస్థితులను పర్యవేక్షించాలని, అవసరమైన సహాయక చర్యలు చేపట్టేందుకు సిద్ధంగా ఉండాలని ఆదేశించారు.
జిల్లా కలెక్టరేట్ కంట్రోల్ రూమ్ ఫోన్ నంబర్: 08672-252399
ప్రజలకు, మత్స్యకారులకు విజ్ఞప్తి
వాతావరణ శాఖ జారీ చేసే హెచ్చరికలను ఎప్పటికప్పుడు గమనిస్తూ, అధికారుల సూచనలను తప్పనిసరిగా పాటించాలని జిల్లా కలెక్టర్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. మత్స్యకారులు వేటకు వెళ్ళే విషయంలో వాతావరణ శాఖ సూచనలను అనుసరించాలని, తీరప్రాంత ప్రజలు నిరంతరం అప్రమత్తంగా ఉండాలని కోరారు.

