మచిలీపట్నంలో అధ్వానంగా జిల్లా కోర్టు రహదారి: సాయిబాబా గుడి వద్ద పనుల్లో తీవ్ర ఆలస్యం… వాహనదారుల అవస్థలు
మచిలీపట్నం:
నగరంలో అత్యంత రద్దీగా ఉండే రహదారుల్లో ఒకటైన జిల్లా కోర్టు రహదారిపై ప్రయాణం నిత్యం నరకప్రాయంగా మారింది. ముఖ్యంగా సాయిబాబా గుడి వద్ద నుంచి జిల్లా కోర్టు వైపు వెళ్లే మార్గం ఉదయం వేళల్లో తీవ్ర రద్దీతో నిండి ఉంటుంది. అయితే ఈ ప్రధాన రహదారిపై సాయిబాబా గుడి వద్ద డ్రైనేజీ నిర్మాణం కోసం రోడ్డును పగలగొట్టి నెలలు గడుస్తున్నా పనులు ముందుకు సాగకపోవడంపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
అత్యంత నిదానంగా డ్రైనేజీ నిర్మాణాన్ని పూర్తి చేసి, దానిపై స్లాబ్ (టాప్) వేసినప్పటికీ… ఆ డ్రైనేజీని ప్రధాన రోడ్డుతో కలిపే అప్రోచ్ రోడ్డును వేయకపోవడం అధికారుల నిర్లక్ష్యానికి అద్దం పడుతోంది. విశాలమైన రోడ్డు అందుబాటులో ఉన్నప్పటికీ, కొత్తగా కట్టిన డ్రైనేజీ పాడవుతుందన్న నెపంతోనో ఏమో కానీ పక్కన కేవలం మూడు సిమెంట్ రాళ్లను ఏర్పాటు చేసి దాటడానికి మార్గం ఇచ్చారు. దీంతో కోర్టు వైపు వచ్చేవారు, వెళ్లేవారు ఆ సిమెంట్ రాళ్లపై నుంచే ప్రమాదకరంగా డ్రైనేజీని దాటాల్సి వస్తోంది.
ఇటీవల కురిసిన వర్షాలకు తోడు అర్నాబ్, మురసు తుఫానుల ధాటికి అక్కడ రోడ్డు దాటేందుకు తాత్కాలికంగా వేసిన మట్టి కూడా కొట్టుకుపోయి పెద్ద ఎత్తున గుంతలు ఏర్పడ్డాయి. ఫలితంగా ఉదయం వేళల్లో ఈ రోడ్డు దాటాలంటే వాహనదారులు, బాటసారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇప్పటికైనా సంబంధిత పురపాలక, రహదారుల అధికారులు స్పందించి అప్రోచ్ రోడ్డును నిర్మించి, జిల్లా కోర్టు రహదారిని త్వరగా పునరుద్ధరించాలని నగర ప్రజలు, వాహనదారులు విజ్ఞప్తి చేస్తున్నారు.

