ఆంధ్ర కేసరి టంగుటూరి ప్రకాశం పంతులు సేవలు చిరస్మరణీయం
ప్రకాశం పంతులు జీవితాన్ని ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకోవాలి…… జిల్లా స్పోర్ట్స్ అథారిటీ అధికారి……కె. ఝాన్సీ లక్ష్మి
మచిలీపట్నం :
ఆంధ్ర కేసరి టంగుటూరి ప్రకాశం పంతులు 69వ వర్ధంతి కార్యక్రమాన్ని 45వ డివిజన్ ఇండోర్ స్టేడియంలో బ్రాహ్మణ వెల్ఫేర్ కార్పొరేషన్ స్టేట్ డైరెక్టర్, 45వ డివిజన్ తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్, పి. వి. ఫణి కుమార్ ఆధ్వర్యంలో ఆ మహనీయుని చిత్రపటానికి పలువురు పూలమాలలు వేసి నివాళులర్పించి, ఆ మహనీయుని సేవలను కొనియాడారు.
ఈ సందర్భంగా జిల్లా స్పోర్ట్స్ అథారిటీ అధికారి కె.ఝాన్సీ లక్ష్మి మాట్లాడుతూ త్యాగం, ధైర్యం, నిజాయితీకి ప్రతీక అయిన ఆంధ్ర కేసరి టంగుటూరి ప్రకాశం పంతులు వర్ధంతి సందర్భంగా వారికి ఘన నివాళులు అర్పిస్తున్నామని తెలిపారు.స్వాతంత్ర్య సమరంలో బ్రిటిష్ పాలకులకు ఎదురువెళ్లి , ప్రజల హక్కుల కోసం నిర్భయంగా పోరాడిన మహనీయుడు ప్రకాశం పంతులు ఆంధ్రుల కు గర్వకారణమని అన్నారు. “సైమన్ గో బ్యాక్” ఉద్యమ సమయంలో తుపాకీకి ఎదురు నిలబడి తన ప్రాణాలను సైతం లెక్కచేయకుండా చూపిన ధైర్యసాహసాలు ఆయన మహోన్నత వ్యక్తిత్వానికి నిదర్శనమని పేర్కొన్నారు.ప్రజాసేవ పట్ల ఆయనకు ఉన్న అంకితభావం, నిజాయితీ, నిబద్ధత నేటి తరానికి ఆదర్శప్రాయమైనవని, సమాజ హితం కోసం ఆయన చేసిన త్యాగాలు చిరస్మరణీయమని తెలిపారు.నిజాయితీ, ధైర్యం, ప్రజాసేవ అనే విలువలను ప్రతి ఒక్కరూ ఆచరణలో పెట్టి సమాజ అభివృద్ధికి కృషి చేయాలని ఈ సందర్భంగా పిలుపునిచ్చారు.బిజెపి సీనియర్ నాయకుడు ధూళిపాళ్లశ్రీరామచంద్రమూర్తి మాట్లాడుతూ ఆంధ్ర కేసరిగా పిలవబడే ప్రకాశం పంతులు ప్రజల హృదయాలలో ఇప్పటికీ ఎప్పటికీ చిరస్మరణీయుడు అన్నారు. ఆ మహనీయుని జీవితాన్ని ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకోవాలి అన్నారు.
ఈ కార్యక్రమంలో బ్రాహ్మణ వెల్ఫేర్ కార్పొరేషన్ డైరెక్టర్, 45వ డివిజన్ తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్, పి. వి. ఫణి కుమార్ తో పాటుగా అర్బన్ బ్యాంక్ డైరెక్టర్, వేము కోటేశ్వరరావు, సాదం సత్యనారాయణ, దారపు రెడ్డి వేణుగోపాల్, మామిడి హారిక తదితరులు పాల్గొన్నారు.

