సోనమ్ వాంగ్‌చుక్
ప్రస్తుతం ఢిల్లీలోని జంతర్ మంతర్ వేదికగా సోనమ్ వాంగ్‌చుక్ చేస్తున్న ఆమరణ నిరాహార దీక్ష దేశవ్యాప్తంగా పెద్ద సంచలనంగా మారింది. ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్న వాంగ్‌చుక్ కు అఖిలేష్ యాదవ్, మమతా బెనర్జీ, అరవింద్ కేజ్రీవాల్, ఉద్ధవ్ ఠాకరే వంటి ప్రతిపక్ష నేతలు సంఘీభావం తెలుపుతూ, ఆయన ఆరోగ్యం దృష్ట్యా దీక్ష విరమించాలని కోరారు. ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ మాట్లాడుతూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వెంటనే తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.
అయితే ఈ ఉద్యమం దేనికోసం, అసలు ఎందుకు ప్రారంభమైందో పూర్తి వివరాలు తెలుసుకునే ముందు ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్న సోనమ్ వాంగ్‌చుక్ గురించి తెలుసుకుందాం!
సోనమ్ వాంగ్‌చుక్ భారతదేశానికి చెందిన ప్రముఖ ఇంజనీర్, విద్యా సంస్కర్త మరియు పర్యావరణ ఉద్యమకారుడు. లడఖ్ ప్రాంతానికి చెందిన ఆయన, అక్కడి భౌగోళిక పరిస్థితులకు అనుగుణంగా ఎన్నో వినూత్న ఆవిష్కరణలు చేసి ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందారు. సూపర్ హిట్ హిందీ సినిమా ‘3 ఇడియట్స్’ లోని ఫున్సుఖ్ వాంగ్డు (ఆమిర్ ఖాన్ పాత్ర) క్యారెక్టర్ ఈయన జీవితం ఆధారంగానే రూపొందించబడింది.
సోనమ్ వాంగ్‌చుక్ లడఖ్ ప్రాంతంలోని లేహ్ లో 1966 సెప్టెంబర్ 1న జన్మించారు. ఆయన జన్మించిన గ్రామం సింధు నది ఒడ్డున, అత్యంత మారుమూల కొండల మధ్య ఉంటుంది. అప్పట్లో అక్కడ కనీస వసతులు, బడులు కూడా సరిగ్గా ఉండేవి కావు. ఆ ఊరిలో పాఠశాలలు లేకపోవడం వల్ల వాంగ్‌చుక్ తన 8వ ఏట వరకు పాఠశాలకు వెళ్ళలేదు. ఆ తర్వాత వారి కుటుంబం శ్రీనగర్‌కు మారడంతో ఆయన అక్కడ అధికారికంగా పాఠశాల విద్యను ప్రారంభించారు. భాషా సమస్యల వల్ల మొదట్లో ఇబ్బందులు పడినా, తన పట్టుదలతో శ్రీనగర్‌లోని నిట్ నుండి మెకానికల్ ఇంజనీరింగ్ పూర్తి చేశారు.
వాంగ్‌చుక్ వ్యక్తిత్వ రూపకల్పనలో తల్లిదండ్రుల పాత్ర చాలా విశేషమైనది. ఆయన తండ్రి సోనమ్ వాంగ్‌గ్యాల్ లడఖ్ ప్రాంతంలో ఒక ప్రముఖ రాజకీయ నాయకుడు మరియు సామాజిక కార్యకర్త. ఆయన జమ్మూ కాశ్మీర్ ప్రభుత్వంలో మంత్రిగా కూడా సేవలు అందించారు. లడఖ్ ప్రాంత అభ్యున్నతికి, అక్కడి ప్రజల హక్కుల కోసం ఆయన చేసిన కృషి సోనమ్ వాంగ్‌చుక్‌ను చిన్నతనం నుంచే సామాజిక స్పృహ వైపు నడిపించింది.
తల్లి దేశ్కిత్ అంగ్మో ఒక గృహిణి. వాంగ్‌చుక్ జీవితంలో, ఆయన విద్యా దృక్పథంలో ఆమె పాత్ర అత్యంత కీలకమైనది. వాంగ్‌చుక్ జన్మించిన గ్రామంలో పాఠశాలలు లేకపోవడంతో, ఆయనకు 8 సంవత్సరాల వయసు వచ్చే వరకు ఆమె ఇంటి వద్దే స్వయంగా విద్యను నేర్పించారు. ఆమె వాంగ్‌చుక్‌కు మాతృభాష అయిన లడఖీ భాషలోనే చదవడం, రాయడం నేర్పించడమే కాకుండా… వ్యవసాయం, ప్రకృతిని ప్రేమించడం వంటి ఆచరణాత్మక విషయాలను కథల రూపంలో బోధించారు. ప్రకృతిని చూస్తూ, పొలాల్లో తిరుగుతూ ప్రాక్టికల్ విషయాలను నేర్చుకోవడం ఆయనకు చిన్నతనం నుంచే అలవాటయింది. ఇదే అనుభవం ఆయనను భవిష్యత్తులో ప్రాక్టికల్ విద్యా విధానాన్ని (SECMOL) స్థాపించేలా ప్రేరేపించింది.
“నాకు ఎనిమిదేళ్లు వచ్చే వరకు మా అమ్మే నా గురువు. ఆ వయసులో పుస్తకాల కంటే ప్రకృతిని చూసి నేర్చుకోవడమే మంచిదని ఆమె నమ్మారు. నా సృజనాత్మకతకు ఆ రోజుల్లో అమ్మ ఇచ్చిన స్వేచ్ఛే పునాది” అని వాంగ్‌చుక్ పలు సందర్భాల్లో గుర్తుచేసుకున్నారు. సాధారణంగా మంత్రి కుమారుడైనప్పటికీ, వాంగ్‌చుక్ విలాసాలకు దూరంగా అత్యంత సాధారణ జీవితాన్ని గడపడానికి, సమాజ సేవ వైపు అడుగులు వేయడానికి ఆయన తల్లిదండ్రులు ఇచ్చిన విలువలే ప్రధాన కారణం.
విద్యా సంస్కరణలు – SECMOL
లడఖ్ విద్యార్థుల కోసం 1988లో SECMOL (Students’ Educational and Cultural Movement of Ladakh) అనే సంస్థను స్థాపించారు. సాంప్రదాయ విద్యా విధానంలో విఫలమైన (ఫెయిల్ అయిన) విద్యార్థులను చేరదీసి, వారికి ప్రాక్టికల్ నాలెడ్జ్, పర్యావరణ పరిరక్షణ, జీవన నైపుణ్యాలను నేర్పించడం దీని ప్రత్యేకత. ఈ క్యాంపస్ పూర్తిగా సౌరశక్తి ఆధారంగా పనిచేస్తుంది. ఆ తర్వాత ఉన్నత విద్య కోసం HIAL (Himalayan Institute of Alternatives, Ladakh)ను కూడా ప్రారంభించారు.
“విఫలమవ్వడం తప్పు కాదు” – SECMOL వినూత్న సూత్రం
ఆయన స్థాపించిన SECMOL స్కూల్ గేటుపై “రిజెక్ట్స్ కాలేజ్” (రానివారి కోసమే ఈ పాఠశాల) అని రాసి ఉంటుంది. బోర్డు పరీక్షల్లో ఫెయిల్ అయిన విద్యార్థులకు మాత్రమే ఇక్కడ అడ్మిషన్ దొరుకుతుంది. అక్కడ పుస్తకాల కంటే ప్రాక్టికల్ లైఫ్‌కే ప్రాధాన్యత ఎక్కువ. విద్యార్థులే స్వయంగా రేడియో స్టేషన్ నడుపుతారు, సౌరశక్తి ప్లాంట్లను మెయింటైన్ చేస్తారు, వ్యవసాయం నేర్చుకుంటారు, పత్రికలు నడుపుతారు.
“పరీక్షల్లో మార్కులు రానంత మాత్రాన జీవితంలో ఫెయిల్ అయినట్లు కాదు, ప్రతి ఒక్కరిలో ఒక ప్రత్యేక నైపుణ్యం ఉంటుంది” అని నమ్మడమే సోనమ్ వాంగ్‌చుక్ విద్యా విధానం. ఆయన వినూత్న ఆలోచనలు, పర్యావరణ స్పృహ, సమాజం పట్ల ఉన్న బాధ్యత నేటి యువతకు ఎంతో స్ఫూర్తిదాయకం.
ఐస్ స్తూపాలు
లడఖ్ వంటి శీతల ఎడారి ప్రాంతాల్లో వేసవిలో ఎదురయ్యే నీటి ఎద్దడిని తీర్చడానికి సోనమ్ వాంగ్‌చుక్ ‘ఐస్ స్తూపాలు’ అనే కృత్రిమ హిమానీనదాలను సృష్టించారు. శీతాకాలంలో వృథాగా పోయే నీటిని పైపుల ద్వారా తీసుకొచ్చి, రాత్రి వేళల్లో గడ్డకట్టేలా చేసి పెద్ద మంచు స్తూపాలుగా మారుస్తారు. ఇవి వేసవి కాలంలో మెల్లగా కరిగి రైతులకు సాగునీరు, తాగునీరు అందిస్తాయి.
మట్టి ఇళ్ళు – పర్యావరణ అనుకూల భవనాలు
లడఖ్‌లో చలికాలంలో మైనస్ డిగ్రీల ఉష్ణోగ్రత (-20°C నుండి -30°C వరకు) ఉంటుంది. రూమ్‌లను వేడిగా ఉంచడానికి అక్కడి ప్రజలు టన్నుల కొద్దీ బొగ్గు, కిరోసిన్ వాడుతుంటారు. దీనికి పరిష్కారంగా సోనమ్ “సౌరశక్తి ఆధారిత మట్టి ఇళ్లను” డిజైన్ చేశారు. ఈ ఇళ్లను స్థానికంగా దొరికే మట్టి, గడ్డి, ఇంకా లడఖ్ ఎండ తీవ్రతను పట్టి ఉంచే ప్రత్యేక నిర్మాణ శైలితో కడతారు. దీనివల్ల బయట మైనస్ డిగ్రీల చలి ఉన్నా, ఇంట్ లోపల ఎలాంటి హీటర్లు వాడకుండానే సౌకర్యవంతమైన +15°C నుండి +20°C ఉష్ణోగ్రత మెయింటైన్ అవుతుంది.
సైన్యానికి అండగా “సౌరశక్తి టెంట్లు”
భారతీయ జవాన్లు హిమాలయ సరిహద్దుల్లో, ముఖ్యంగా గాల్వన్ లోయ వంటి అత్యంత చలి ప్రాంతాలలో దేశాన్ని రక్షిస్తూ ఎన్నో ఇబ్బందులు పడుతుంటారు. వారి కోసం ఆయన “సోలార్ హీటెడ్ మిలిటరీ టెంట్లను” ఆవిష్కరించారు. ఈ టెంట్లు పగటిపూట సూర్యరశ్మిని గ్రహించి, రాత్రి వేళల్లో జవాన్లకు వెచ్చదనాన్ని ఇస్తాయి. దీనివల్ల ఆర్మీకి లక్షలాది లీటర్ల కిరోసిన్ ఆదా అవ్వడమే కాకుండా, కాలుష్యం తగ్గి సైనికుల ఆరోగ్యం కూడా మెరుగ్గా ఉంటుంది.
స్థానిక సంస్కృతి, స్వదేశీ వస్తువుల వాడకం
ఆయన పర్యావరణానికే కాదు, స్థానిక ఆర్థిక వ్యవస్థకు కూడా పెద్ద పీట వేస్తారు. “పర్యాటకులు లడఖ్ అందాలను చూడటానికి రండి, కానీ ఇక్కడి పర్యావరణాన్ని నాశనం చేసే ప్లాస్టిక్, విలాసాలను తీసుకురాకండి” అని చెప్తారు. అలాగే స్వదేశీ వస్తువులను ప్రోత్సహించడం, పర్యావరణానికి హాని చేయని జీవనశైలిని అవలంబించడం ఆయన ముఖ్య ఉద్దేశ్యం. ప్రస్తుతం ఆయన చేస్తున్న పోరాటాలు కూడా కేవలం రాజకీయ ప్రయోజనాల కోసం కాకుండా, రాబోయే తరాలకు స్వచ్ఛమైన పర్యావరణాన్ని, పారదర్శకమైన విద్యా వ్యవస్థను అందించాలనే ఆశయంతోనే సాగుతున్నాయి.
అవార్డులు – గుర్తింపు
ఆయన చేసిన సామాజిక, విద్యా సేవలకు గుర్తింపుగా ఆసియా ఖండపు నోబెల్ బహుమతిగా భావించే రామన్ మెగసేసే అవార్డు లభించింది. ఐస్ స్తూపాలు అద్భుత ఆవిష్కరణకు గానూ ఆయనకు ప్రతిష్టాత్మకమైన రోలెక్స్ అవార్డు దక్కింది.

ప్రస్తుత తాజా పరిణామాలు
గతంలో లడఖ్‌కు 6వ షెడ్యూల్ కింద రాజ్యాంగ రక్షణ కల్పించాలని పెద్ద ఎత్తున ఉద్యమించిన సోనమ్ వాంగ్‌చుక్, ప్రస్తుతం దేశ రాజధాని ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద మరో ఉధృతమైన పోరాటం చేస్తున్నారు. దేశంలో జరిగిన పోటీ పరీక్షల (NEET) పేపర్ లీకేజీలపై, విద్యా వ్యవస్థలో సంస్కరణలు తేవాలని డిమాండ్ చేస్తూ ‘కాక్రోచ్ జనతా పార్టీ’ (CJP) ఆధ్వర్యంలో జరుగుతున్న యువజన ఉద్యమానికి మద్దతుగా ఆయన జంతర్ మంతర్ వద్ద దీక్షకు దిగారు.
కేవలం నీరు మాత్రమే తీసుకుంటూ ఆయన చేస్తున్న ఆమరణ నిరాహార దీక్ష 20వ రోజుకు చేరుకోవడంతో ఆయన ఆరోగ్యం క్షీణించింది. బరువు గణనీయంగా తగ్గడం, అవయవాలపై ప్రభావం పడే ప్రమాదం ఉందని వైద్యులు హెచ్చరించడంతో, ఢిల్లీ హైకోర్టు కూడా ఆయన ఆరోగ్యాన్ని ప్రతిరోజూ పర్యవేక్షించాలని అధికారులను ఆదేశించింది. అయితే విద్యావ్యవస్థలో పారదర్శకత కోసం జూలై 20న పార్లమెంట్ మార్చ్ విజయవంతం అయ్యే వరకు తన పోరాటం ఆపనని ఆయన స్పష్టం చేశారు.
ఉద్యమం ప్రధానంగా భారతదేశ విద్యా వ్యవస్థలో సంస్కరణలు మరియు పోటీ పరీక్షల పారదర్శకత కోసం జరుగుతున్న పోరాటం. ఈ ఏడాది జరిగిన NEET వంటి ప్రతిష్టాత్మక దేశవ్యాప్త పరీక్షల్లో జరిగిన భారీ అక్రమాలు, పేపర్ లీకేజీల వల్ల లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్తు అంధకారంలో పడింది. ఈ వైఫల్యానికి నైతిక బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వెంటనే తన పదవికి రాజీనామా చేయాలని, భవిష్యత్తులో ఇలాంటి పేపర్ లీక్‌లు జరగకుండా కఠినమైన చట్టాలు, పారదర్శకమైన విద్యా విధానాన్ని తీసుకురావాలని ఈ ఉద్యమం డిమాండ్ చేస్తోంది. ఈ ఉద్యమాన్ని కాక్రోచ్ జనతా పార్టీ (CJP) అనే యువజన/విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నారు. లక్షలాది మంది విద్యార్థులు, యువత దీనికి మద్దతు తెలపడంతో ఇది జంతర్ మంతర్ వద్ద ప్రత్యక్ష ఉద్యమంగా మారింది.
విద్యావేత్తగా విద్యార్థుల బాధను అర్థం చేసుకున్న సోనమ్ వాంగ్‌చుక్, జూన్ 28న ఈ నిరసనకు మద్దతుగా నేరుగా రంగంలోకి దిగి ఆమరణ నిరాహార దీక్ష ప్రారంభించారు. జూలై 16 వ తేదీకి దీక్ష 19వ రోజుకు చేరడంతో ఆయన దాదాపు 9 కిలోల బరువు తగ్గారు. ఆరోగ్యం అత్యంత క్షీణించడంతో రోజువారీ వైద్య పర్యవేక్షణ చేయాలని ఢిల్లీ హైకోర్టు అధికారులను ఆదేశించింది. వైద్యులు అవయవాల వైఫల్యం జరిగే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నా ఆయన వెనక్కి తగ్గడం లేదు. “నేను జూలై 20 వరకు ఎలాగైనా ప్రాణాలతో ఉంటాను. ఆ రోజు జరిగే పార్లమెంట్ మార్చ్ విజయవంతం కావాలి” అని ఆయన పిలుపునిచ్చారు.
చలో పార్లమెంట్ (జూలై 20)
జూలై 20 నుండి పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ప్రారంభం కానున్నాయి. అదే రోజున దేశవ్యాప్తంగా ఉన్న విద్యార్థులు, యువతతో కలిసి చలో పార్లమెంట్ శాంతియుత ర్యాలీ నిర్వహించాలని CJP పిలుపునిచ్చింది. ప్రభుత్వం స్పందించి విద్యావ్యవస్థలో మార్పులు తెచ్చే వరకు లేదా తన ప్రాణం ఉన్నంత వరకు ఈ పోరాటం ఆపేది లేదని వాంగ్‌చుక్ స్పష్టం చేయడంతో దేశవ్యాప్తంగా ఉత్కంఠ నెలకొంది.
శ్యామ్ కాగిత
మచిలీపట్నం

