విద్యార్థుల క్రమశిక్షణకు, పరిశుభ్రతకు చర్యలు తీసుకోండి
ఉప విద్యాశాఖ అధికారులను,మండల విద్యాశాఖ అధికారులను, ప్రధానోపాధ్యాయులను ఆదేశించిన జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ
మచిలీపట్నం:
విద్యార్థులలో క్రమశిక్షణ నైతిక విలువలు పెంపొందించేలాగా చర్యలు తీసుకోవాలని కృష్ణా జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ జిల్లాలోని ఉప విద్యాశాఖ అధికారులను, మండల విద్యాశాఖ అధికారులను, ప్రధానోపాధ్యాయులను, ఉపాధ్యాయులను ఆదేశించారు. మంగళవారం జిల్లా కలెక్టర్ డి.కె. బాలాజీ, జిల్లా విద్యాశాఖ అధికారి యు.వి. సుబ్బారావు జిల్లాలోని అన్ని మండల విద్యాశాఖ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు.
ఈ సమావేశంలో జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో విద్యా ప్రమాణాల పెంపుకు కృషి చేయాలన్నారు. విద్యార్థినీ విద్యార్థుల పరిశుభ్రత, క్రమశిక్షణ మరింత మెరుగయ్యేలా చర్యలు తీసుకోవాలన్నారు. వారి సంక్షేమానికి సంబంధించిన పలు అంశాలపై సమగ్రంగా సమీక్షించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ పాఠశాల ప్రాంగణాలను ఎల్లప్పుడూ పరిశుభ్రంగా ఉంచాలని, విద్యార్థులందరూ నిర్దేశిత యూనిఫాం ధరించేలా చూడాలన్నారు. విద్యార్థులు ఇంటికి వెళ్ళాక కనీసం రోజుకు రెండు గంటలు వారి తరగతికి సంబంధించిన పుస్తక పఠనం చేసేలాగా ప్రోత్సహించాలన్నారు. విద్యార్థులకు మధ్యాహ్న భోజన పథకంలో పోషకాహారం అందేలాగా చర్యలు తీసుకోవాలన్నారు. విద్యార్థులు పరిశుభ్రమైన హెయిర్‌కట్‌తో పాఠశాలకు హాజరయ్యేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. అలాగే విద్యార్థుల ఉపాధ్యాయుల ముఖ హాజరును ప్రతిరోజూ క్రమం తప్పకుండా పర్యవేక్షించాలన్నారు. పాఠశాలల్లో క్రమశిక్షణ, సమయపాలన సానుకూల విద్యా వాతావరణం నెలకొనేలా ప్రత్యేక చర్యలు చేపట్టాలన్నారు. అదే విధంగా ప్రతిరోజు కనీసం 25 నిమిషాలు యోగ, ధ్యానం చేయడం వలన ఏకాగ్రత పెరిగి విద్యార్థుల అభ్యాసన సామర్థ్యాలు మెరుగై ఫలితాలు మరింత మెరుగుపడతాయని తెలియజేశారు.
అన్ని మండల విద్యాశాఖ అధికారులు తమ పరిధిలోని పాఠశాలలను నిరంతరం సందర్శిస్తూ, పై అంశాల అమలును క్షేత్రస్థాయిలో పర్యవేక్షించి, విద్యార్థినీ విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ ఆదేశించారు.

