విద్యార్థులు ఉన్నత లక్ష్యాలతో, ముందస్తు ప్రణాళికతో చదివితేనే విజయాలు సాధ్యం – జిల్లా కలెక్టర్ డీకే బాలాజి
మచిలీపట్నం/పెడన:
విద్యార్థులు ఉన్నత లక్ష్యాలను నిర్దేశించుకుని క్రమశిక్షణతో, ముందస్తు ప్రణాళికతో చదివితేనే ఆశించిన విజయాలు సాధించగలరని జిల్లా కలెక్టర్ డీకే బాలాజి ఉద్బోధించారు. మంగళవారం ఉదయం జిల్లా కలెక్టర్ మచిలీపట్నం నగరంలోని చిలకలపూడి పాండురంగ ఉన్నత పాఠశాల, రుస్తుంబాద పార్క్ నగరపాలక సంస్థ బాలికల ఉన్నత పాఠశాల, అలాగే పెడన మండలంలోని భట్ట జ్ఞానకోటయ్య జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలను సందర్శించారు. పాఠశాలల్లో విద్యా బోధన, ఉత్తీర్ణత శాతం, మౌలిక సదుపాయాలు, విద్యార్థులకు కల్పిస్తున్న వసతులు, పాఠశాలల్లో ఉన్న సమస్యలపై ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులను అడిగి తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా విద్యార్థులతో ఆత్మీయంగా మాట్లాడిన కలెక్టర్ వారి దినచర్య, ఉదయం ఎంత సమయంలో నిద్రలేస్తున్నారు, రోజువారీ చదువుకు ఎంత సమయం కేటాయిస్తున్నారు, ఏ విధంగా పరీక్షలకు సిద్ధమవుతున్నారు, చదివిన పాఠాలను ఎలా పునశ్చరణ చేసుకుంటున్నారు వంటి అంశాలపై ఆరా తీశారు. చదివిన పాఠాలను ఎప్పటికప్పుడు ఒకటి లేదా రెండుసార్లు పునశ్చరణ చేసుకుంటే అవి మెదడులో ఎక్కువకాలం నిలిచిపోతాయని తెలిపారు. తాను కూడా విద్యార్థిగా ఉన్నప్పుడు ఒక అధ్యాయాన్ని వరుసగా రెండు, మూడు సార్లు పూర్తిగా చదివిన తర్వాతే తదుపరి అధ్యాయానికి వెళ్లేవాడినని పేర్కొన్నారు. ఈ విధానం విద్యార్థులకు మంచి ఫలితాలను అందిస్తుందని సూచించారు.
రాబోయే వార్షిక పరీక్షలను దృష్టిలో పెట్టుకుని చివరి సమయంలో కాకుండా ఇప్పటి నుంచే ప్రణాళికాబద్ధంగా చదువు ప్రారంభించాలని సూచించారు. అదనపు తరగతులను సద్వినియోగం చేసుకుని ప్రతి విద్యార్థి అత్యుత్తమ ప్రతిభ కనబర్చాలని ఆకాంక్షించారు. విద్యార్థులను యోగా సాధన గురించి అడిగి తెలుసుకున్న కలెక్టర్, ప్రతిరోజూ యోగా చేయడం వల్ల శారీరక, మానసిక ఆరోగ్యం మెరుగుపడటంతో పాటు చదువులో ఏకాగ్రత పెరుగుతుందని చెప్పారు. యోగా తరగతుల్లో ప్రాణాయామం వంటి వ్యాయామాలను క్రమం తప్పకుండా అభ్యసించాలని సూచించారు.
అనంతరం చిలకలపూడి పాండురంగ ఉన్నత పాఠశాల, పెడన జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలల్లో సమగ్ర శిక్ష ఆధ్వర్యంలో నిర్మిస్తున్న ఆటిజం (Autism) ప్రత్యేక శిక్షణ కేంద్రాల నిర్మాణ పనులను జిల్లా కలెక్టర్ పరిశీలించారు. ప్రత్యేక అవసరాలు ఉన్న (భవిత) పిల్లలకు నాణ్యమైన శిక్షణ, సౌకర్యాలు అందించేలా నిర్మాణ పనులు ప్రమాణాలకు అనుగుణంగా చేపట్టాలని అధికారులను ఆదేశించారు. నిర్మాణ నాణ్యత, పనుల పురోగతిపై సంబంధిత అధికారులతో చర్చించి పలు సూచనలు చేశారు.
ఈ తనిఖీల సందర్భంగా సమగ్ర శిక్ష కోఆర్డినేటర్ వేణుగోపాల్, రీజినల్ ఇంజినీర్ ప్రసాద్ తదితరులు జిల్లా కలెక్టర్కు నిర్మాణ పనుల వివరాలను వివరించారు. కలెక్టర్ వెంట మచిలీపట్నం డివిజన్ డిప్యూటీ డిఈఓ శేఖర్ సింగ్, ఉపాధ్యాయులు తదితరులు ఉన్నారు.

