యూనివర్సిటీ లో నూతన భవనానికి పింగళి పేరు – కృష్ణా యూనివర్సిటీ వీసీ
మచిలీపట్నం:
కృష్ణా విశ్వవిద్యాలయం లో నిర్మిస్తున్న నూతన భవనాల్లో ఒక దానికి జాతీయ పతాక రూపశిల్పి పింగళి వెంకయ్య పేరు పెడతామని ఉపకులపతి ఆచార్య కె.రాంజీ ప్రకటించారు. విశ్వవిద్యాలయ ఎన్ ఎస్ ఎస్ విభాగం ఆధ్వర్యంలో శనివారం నిర్వహించిన మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు జయంతి, జాతీయ పతాక రూపశిల్పి పింగళి వెంకయ్య వర్ధంతి కార్యక్రమం లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. బ్రిటిష్ ప్రభుత్వం పై పోరాటం చేసి మన్యం వీరుడు గా కీర్తి గడించిన అల్లూరి సీతారామరాజు చాలా పిన్న వయసులో తనువు చాలించిడం బాధాకరమన్నారు. ఆయన పేరుమీద ఓ జిల్లా ఏర్పాటు చేయడం, భోగాపురం విమానాశ్రయానికి పేరు పెట్టడం హర్షణీయమన్నారు. అదేవిధంగా ఉపాధ్యాయ వృత్తిలో ఉన్న పింగళి వెంకయ్య దేశానికి జాతీయ పతాకం రూపొందించటం కృష్ణాజిల్లా కు గర్వకారణమన్నారు.
ఎన్ ఎస్ ఎస్ విభాగం సమన్వయకర్త డాక్టర్ ఎం. శ్రావణి అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో తొలుత అల్లూరి సీతారామరాజు, పింగళి వెంకయ్య చిత్రపటాలకు పూల మాలలు వేసి నివాళులు అర్పించారు. ఫార్మసీ కళాశాల ప్రిన్సిపాల్ డా. రాంబాబు, పలువురు సహాయ ఆచార్యులు, బోధనేతర సిబ్బంది పాల్గొన్నారు.

