ఆత్మహత్యల నివారణకు అవగాహనే ఆయుధం – ‘నో సూసైడ్’ మాసోత్సవాలపై జిల్లా స్థాయి సదస్సు
మచిలీపట్నం:
మహిళా మరియు శిశు సంక్షేమ శాఖ గౌరవ సెక్రటరీ ఆదేశాల మేరకు, ఆత్మహత్యల నివారణపై ప్రజల్లో అవగాహన పెంపొందించేందుకు జూన్ 15 నుండి జూలై 15 వరకు నెల రోజుల పాటు ‘నో సూసైడ్’ మాసోత్సవాలు జిల్లా వ్యాప్తంగా నిర్వహించబడుతున్నాయి.
ఈ కార్యక్రమాల్లో భాగంగా గురువారం నాడు మహిళా మరియు శిశు సంక్షేమ శాఖ కృష్ణాజిల్లా ప్రాజెక్ట్ డైరెక్టర్ శ్రీమతి ఎం.ఎం. రాణి ఆధ్వర్యంలో జిల్లా స్థాయి అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా మిషన్ కోఆర్డినేటర్ శ్రీమతి ప్రసన్న విశ్వనాథన్ ‘నో సూసైడ్’, ‘మానస్ వికాస్’ కార్యక్రమాల ఉద్దేశ్యాలను వివరించడంతో పాటు, మానసిక ఆరోగ్య పరిరక్షణ, ఒత్తిడి నిర్వహణ, ఆత్మవిశ్వాసం పెంపొందించుకోవడం, సమస్యలను ధైర్యంగా ఎదుర్కోవడం వంటి అంశాలపై పాల్గొన్న వారికి విస్తృత అవగాహన కల్పించారు.
అలాగే మానసిక ఆరోగ్య సహాయానికి సంబంధించిన 14416 – హెల్ప్‌లైన్, మహిళల సహాయార్థం – 181 ఉమెన్ హెల్ప్‌లైన్, పిల్లల రక్షణ కోసం – 1098 చైల్డ్ హెల్ప్‌లైన్, అత్యవసర సేవల కోసం – 112 పోలీస్ హెల్ప్‌లైన్ సేవల గురించి వివరించారు. వన్ స్టాప్ సెంటర్, ఐసీపీఎస్ మరియు ఇతర శాఖలు అందిస్తున్న సేవలపై కూడా అవగాహన కల్పించారు.
ఈ సందర్భంగా ప్రాజెక్ట్ డైరెక్టర్ శ్రీమతి ఎం.ఎం. రాణి మాట్లాడుతూ, మానసిక ఆరోగ్యంపై అవగాహన పెంపొందించడం ద్వారా ఆత్మహత్యలను నివారించవచ్చని, అవసరమైన సమయంలో ప్రభుత్వ హెల్ప్‌లైన్ సేవలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో కృష్ణాజిల్లాలోని ఐసీడీఎస్ సీడీపీవోలు, సూపర్వైజర్లు, పీడీ కార్యాలయ సిబ్బంది, ఐసీపీఎస్ సిబ్బంది, చైల్డ్ హెల్ప్‌లైన్ సిబ్బంది, వన్ స్టాప్ సెంటర్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

