ప్రపంచ రక్తదాతల దినోత్సవం సందర్భంగా రక్తదాతలను సన్మానించిన జిల్లా కలెక్టర్
మచిలీపట్నం:
రక్తదానం ద్వారా అనేక మంది ప్రాణాలను కాపాడవచ్చని, ప్రతి ఆరోగ్యవంతుడు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి రక్తదానం చేయాలని కృష్ణాజిల్లా రెడ్ క్రాస్ సొసైటీ ప్రెసిడెంట్, జిల్లా కలెక్టర్ డీకే బాలాజి పిలుపునిచ్చారు. శనివారం సాయంత్రం కలెక్టరేట్‌లోని పీజీఆర్‌ఎస్ సమావేశ మందిరంలో జూన్ 14 ప్రపంచ రక్తదాతల దినోత్సవాన్ని పురస్కరించుకుని కృష్ణాజిల్లా రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా రక్తదాన కార్యక్రమాలకు సహాయ సహకారాలు అందించిన రక్తదాతలు, స్వచ్ఛంద సేవకులను సత్కరించి అభినందించారు.
అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ, ప్రపంచ రక్తదాతల దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం జూన్ 14న నిర్వహించడం వెనుక శాస్త్రవేత్త కార్ల్ ల్యాండ్‌స్టీనర్ సేవలు ఉన్నాయని తెలిపారు. రక్త గ్రూపుల వ్యవస్థను కనుగొనడం ద్వారా ఆధునిక వైద్య రంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకువచ్చిన ఆయనకు నోబెల్ బహుమతి లభించిందన్నారు. రక్త గ్రూపుల గుర్తింపు లేకముందు రక్త మార్పిడి ప్రక్రియలో అనేక సమస్యలు ఎదురయ్యేవని, ఆయన పరిశోధనలు వైద్యరంగానికి ఎంతో మేలు చేశాయని పేర్కొన్నారు. రక్తదానం అనేది ఒక గొప్ప మానవతా సేవ అని, ఒక వ్యక్తి చేసిన రక్తదానం మరొకరి ప్రాణాలను కాపాడగలదని కలెక్టర్ అన్నారు. స్వచ్ఛందంగా ముందుకు వచ్చి రక్తదానం చేస్తున్న వారందరూ సమాజానికి ఆదర్శంగా నిలుస్తున్నారని కొనియాడారు.

పట్టణ ప్రాంతాల్లో రక్తదానం ఒక సామాజిక బాధ్యతగా, అలవాటుగా మారిందని, అయితే గ్రామీణ ప్రాంతాల్లో ఇంకా అవగాహన పెంచాల్సిన అవసరం ఉందన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో కూడా విస్తృత స్థాయిలో రక్తదాన శిబిరాలు నిర్వహించి ప్రజలను చైతన్యవంతులను చేయాలని సూచించారు. జిల్లాలో త్వరలోనే పెద్ద ఎత్తున రక్తదాన శిబిరాలు నిర్వహించే అంశాన్ని పరిశీలిస్తామని తెలిపారు. సామాజిక మాధ్యమాల ద్వారా రక్తదానం పట్ల మరింత అవగాహన కల్పించాలని కలెక్టర్ పిలుపునిచ్చారు. ప్రతి రక్తదాత తాను రక్తదానం చేసిన విషయాన్ని సోషల్ మీడియాలో పంచుకోవడంతో పాటు మరో వ్యక్తిని కూడా రక్తదానానికి ప్రోత్సహించాలని సూచించారు. ప్రతి సారి రక్తదానం చేసేటప్పుడు కనీసం ఒక కొత్త రక్తదాతను తీసుకురావాలనే సంకల్పంతో ముందుకు వస్తే జిల్లాలో రక్తదాతల సంఖ్య గణనీయంగా పెరుగుతుందన్నారు.
అలాగే బాంబే బ్లడ్ గ్రూప్ వంటి అరుదైన రక్త గ్రూపులు కలిగిన దాతల వివరాలతో ప్రత్యేక డేటాబేస్ ఏర్పాటు చేయడం అవసరమని కలెక్టర్ అభిప్రాయపడ్డారు. అత్యవసర సమయాల్లో అరుదైన రక్తం అందుబాటులోకి రావడానికి ఇటువంటి వ్యవస్థ ఉపయోగపడుతుందని తెలిపారు. రక్తదానం చేస్తున్న ప్రతి ఒక్కరికీ కృష్ణా జిల్లా ప్రజల తరపున ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ పేర్కొన్నారు.
ఈ సందర్భంగా కార్యక్రమంలో ఏపీఎస్‌ఆర్టీసీ డీపీటీఓ, కె. వెంకటేశ్వర్లు, గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కళాశాల ప్రిన్సిపాల్ బి. కరుణ కుమార్, నందివాడ మండల ఎంఆర్ఓ ఎన్. గురుమూర్తి రెడ్డి, డీఆర్ఓ, సిసి తూము వెంకటేశ్వరరావు, కస్తూరి విజయకుమార్ (చల్లపల్లి రక్తదాత), రక్తదాతల ప్రోత్సాహకుడు (డోనర్ మోటివేటర్) వి. నవీన్ కుమార్, లేబాక వెంకటేశ్వరరావును జిల్లా కలెక్టర్ ఘనంగా సత్కరించి అభినందించారు.
కార్యక్రమంలో జిల్లా రెడ్ క్రాస్ సొసైటీ చైర్మన్ డిఆర్కె ప్రసాద్, జనరల్ సెక్రెటరీ బి శంకర నాథ్, ట్రెజరర్ బి సుకుమార్, జిల్లా మలేరియా వైద్య అధికారి డాక్టర్ వెంకటరావు, రక్తదాతలు, సేవకులు తదితరులు పాల్గొన్నారు.

