MachilipatnamLocal News
June 14, 2026
జిల్లా

భూగర్భ జలాల పెంపుదలకు రీఛార్జ్ బావుల నిర్మాణం చేపట్టాలి –– జిల్లా కలెక్టర్

  • June 13, 2026
  • 1 min read
[addtoany]
భూగర్భ జలాల పెంపుదలకు రీఛార్జ్ బావుల నిర్మాణం చేపట్టాలి –– జిల్లా కలెక్టర్

గన్నవరం మండలం ముస్తాబాద్‌లో పైలట్ ప్రాజెక్టును పరిశీలించిన జిల్లా కలెక్టర్ డీకే బాలాజి

గన్నవరం:

జిల్లాలో భూగర్భ జలాల మట్టాన్ని పెంపొందించి భవిష్యత్ నీటి అవసరాలకు స్థిరమైన పరిష్కారం అందించాలనే లక్ష్యంతో చేపట్టిన రీఛార్జ్ బావుల నిర్మాణాన్ని పకడ్బందీగా చేపట్టాలని జిల్లా కలెక్టర్ డీకే బాలాజి అధికారులను ఆదేశించారు. గన్నవరం మండలం ముస్తాబాద్ గ్రామంలో పైలట్ ప్రాజెక్టుగా చేపట్టిన రీఛార్జ్ బావి (రీఛార్జ్ షాఫ్ట్/ఇంజెక్షన్ వెల్) పనులను జిల్లా కలెక్టర్ శనివారం ఉదయం క్షేత్రస్థాయిలో సందర్శించి పరిశీలించారు. ఈ సందర్భంగా ప్రాజెక్టు అమలు విధానం, నిర్మాణ వ్యయం, భూగర్భ జలాల పునరుద్ధరణకు కలిగే ప్రయోజనాలపై అధికారులను అడిగి తెలుసుకున్నారు.

భూగర్భ జలాల వినియోగం అధికంగా ఉండే ప్రాంతాల్లో, ప్రీ-మాన్సూన్ కాలంలో భూగర్భ జల మట్టం ఆరు మీటర్ల కంటే లోతులో ఉన్న గ్రామాలను గుర్తించి రీఛార్జ్ బావుల నిర్మాణాన్ని చేపడుతున్నట్లు అధికారులు కలెక్టర్‌కు వివరించారు. ఒక్కో రీఛార్జ్ షాఫ్ట్ నిర్మాణానికి సుమారు రూ.2 లక్షల వ్యయం అవుతుందని తెలిపారు. జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు భూగర్భ జలాల స్థాయిని పెంపొందించేందుకు ప్రత్యేక చర్యలలో భాగంగా ముస్తాబాద్ గ్రామంలో జల ధార జలహారతి కార్యక్రమం కింద ఈ పైలట్ ప్రాజెక్టును పూర్తి చేసినట్లు అధికారులు వివరించారు. ప్రాజెక్టు అమలులో పొందిన అనుభవాలను సమీక్షించి, భూగర్భ జల శాఖ గుర్తించిన ఇతర అనుకూల ప్రాంతాల్లో కూడా ఇటువంటి రీఛార్జ్ బావుల నిర్మాణాన్ని చేపట్టేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు వివరించారు. రీఛార్జ్ బావి నిర్మాణ పనులను పరిశీలించిన కలెక్టర్ పలు సూచనలు, సలహాలు జారీ చేశారు. వర్షపు నీటిని భూగర్భ జలాల్లోకి సమర్థవంతంగా చేర్చే విధంగా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.

ముస్తాబాద్ గ్రామంలో ఉపాధి హామీ పనులను పరిశీలించిన జిల్లా కలెక్టర్ డీకే బాలాజి

అనంతరం జిల్లా కలెక్టర్ గన్నవరం మండలం ముస్తాబాద్ గ్రామంలో మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం (ఎంజీఎన్‌ఆర్‌ఈజీఎస్) కింద జరుగుతున్న ఉపాధి పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. గ్రామంలో జరుగుతున్న పంటబోదె పూడికతీత పనులను పరిశీలించిన కలెక్టర్, అక్కడ పనిచేస్తున్న ఉపాధి కూలీలతో మాట్లాడారు. వారికి వేతనాలు సకాలంలో అందుతున్నాయా, పనుల నిర్వహణలో ఏవైనా ఇబ్బందులు ఎదురవుతున్నాయా అనే అంశాలను అడిగి తెలుసుకున్నారు. కూలీల అభిప్రాయాలను తెలుసుకుంటూ వారి సమస్యలను శ్రద్ధగా విన్నారు. అనంతరం పనుల పురోగతి, చేపడుతున్న పనుల నాణ్యత, నిర్దేశిత లక్ష్యాల సాధన తదితర అంశాలపై అధికారులను ప్రశ్నించి వివరాలు తెలుసుకున్నారు.

కలెక్టర్ వెంట డ్వామా పీడీ ఎన్ శివప్రసాద్ యాదవ్, ఇరిగేషన్ శాఖ ఎస్ఈ గుణకర్, క్వాలిటీ కంట్రోల్, భూగర్భ జల శాఖ అధికారులు, తహసిల్దార్ శివయ్య, ఎంపీడీవో స్వర్ణలత, క్షేత్రస్థాయి సిబ్బంది తదితరులు ఉన్నారు.

About Author

SSN