మెగా డీఎస్సీలు వేసిన ఘనత చంద్రబాబుది.!
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక 16,347 డీఎస్సీ పోస్టులు భర్తీ – కృష్ణాజిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు వీరంకి వెంకట గురుమూర్తి
మచిలీపట్నం:
వైసిపి ఐదు సంవత్సరాల పరిపాలనలో ఒక్క టీచర్ పోస్టు భర్తీ చేయలేదని, చంద్రబాబు నాయుడు పరిపాలనలో కూటమి ప్రభుత్వం 16,347 టీచర్ పోస్టులను డీఎస్సీ ద్వారా భర్తీ చేస్తే దుష్ప్రచారం చేస్తారా? ఇది సమంజసమేనా? అని కృష్ణా జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు, రాష్ట్ర గౌడ కార్పొరేషన్ అధ్యక్షులు వీరంకి వెంకట గురుమూర్తి ప్రశ్నించారు.
గురువారం స్థానిక ఆర్కే పేరడైజ్ లో ఏర్పాటుచేసిన మీడియా సమావేశంలో గురుమూర్తి మాట్లాడుతూ 2014-19 మధ్య చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో 18 వేల పోస్టులను భర్తీ చేశారన్నారు. ఆయన పరిపాలనలో మొత్తం 11 డిఎస్సీలలో 1,80,208 మంది ఉపాధ్యాయినీ ఉపాధ్యాయులకు ఉపాధి అవకాశాలు కల్పించారన్నారు. జగన్ పరిపాలనలో ఒక్క టీచర్ పోస్ట్ కూడా భర్తీ చేయకపోగా ఇటీవల ఇచ్చిన డీఎస్సీ పోస్టులపై అర్థరహిత వ్యాఖ్యలు చేయడం దారుణమన్నారు. ఇకనైనా నిజానిజాలు తెలుసుకుని మాట్లాడాలన్నారు. జగన్ ప్రభుత్వం ఎన్నికల ముందు 6,100 మందికి ఎన్నికల ముందు నోటిఫికేషన్ మాత్రమే ఇవ్వడం జరిగిందని, పోస్టులు భర్తీ జరగలేదన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక 16,347 మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించామన్నారు.
బాబాయిది గుండెపోటు అన్నారు. నారాసుర రక్త చరిత్ర అన్నారు. చంద్రబాబు మీద ఎన్నో అభాండాలు వేశారు. నిజా నిజాలు ప్రజలు తెలుసుకున్నారు కాబట్టి 151 సీట్లు పొందిన మీకు, 2024 ఎన్నికలలో 11 సీట్లకే పరిమితం చేశారన్నారు. ఐదు సంవత్సరాలు రాష్ట్రాన్ని జగన్మోహన్ రెడ్డి పట్టిపీడించారని గురుమూర్తి అన్నారు. కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టి రెండు సంవత్సరములు పూర్తయిన సందర్భంగా ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలిపారు. తాము అంతా కలిసి మెలిసి ఉన్నామని, తమ మధ్య లేనిపోని వివాదాలు సృష్టించవద్దని కూటమి ఎప్పటికీ సమైక్యంగా ఉంటుందని గురుమూర్తి అన్నారు. దుష్ప్రచారాలు నమ్మవద్దని ప్రజలకు హితవు పలికారు. కూటమి ప్రభుత్వంపై లేనిపోని నిందలు, ఆరోపణలు చేస్తే సహించేది లేదన్నారు. మీడియా పాత్ర చాలా కీలకమని, మీడియా మిత్రుల సహకారం మరువలేనిదని కొనియాడారు. మీడియా మూల స్తంభం లాంటిది అన్నారు. వాస్తవాలను వెలుగులోకి తెచ్చే మీడియా అంటే తనకు ఎంతో గౌరవం అన్నారు.
ఈ కార్యక్రమంలో డిసీఎంఎస్ చైర్మన్ బండి రామకృష్ణ, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర నాయకులు కొనకళ్ళ జగన్నాథ రావు(బుల్లయ్య), కృష్ణాజిల్లా తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి గోపు సత్యనారాయణ, జనసేన నాయకులు గడ్డం రాజు, మాజీ మున్సిపల్ చైర్మన్ మోటమర్రి బాబా ప్రసాద్ ,టిడిపి నాయకులు బత్తిన దాసు తదితరులు పాల్గొన్నారు.

