ఆరోగ్యవంతమైన తల్లి… ఆరోగ్యకరమైన భావితరాలకు పునాది
మచిలీపట్నం:
గూడూరు ప్రభుత్వ కమ్యూనిటీ హెల్త్ సెంటర్లో శ్రీ సత్య సాయి సేవా సమితి ఆధ్వర్యంలో ప్రతి నెల 9వ తేదీన నిర్వహించే “ప్రధానమంత్రి సురక్షిత మాతృత్వ అభియాన్” కార్యక్రమంలో భాగంగా గర్భిణీ స్త్రీలకు నారాయణ సేవ అన్నదాన కార్యక్రమం నిర్వహించారు.
ఈ సందర్భంగా స్త్రీ వైద్య నిపుణురాలు డాక్టర్ అరుణ కాత్యాయని మాట్లాడుతూ సమాజ సేవలో భాగంగా శ్రీ సత్యసాయి సేవా సంస్థలు ఎన్నో సంవత్సరాలుగా గర్భిణీ స్త్రీల సంక్షేమం కోసం సేవా కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమని తెలిపారు. సేవా భావంతో ముందుకు సాగుతున్న కార్యకర్తలను ప్రత్యేకంగా ప్రశంసించారు.
సమితి కన్వీనర్ పోతుకుచి ఆంజనేయ కుమార్ మాట్లాడుతూ తల్లి ఆరోగ్య పరిరక్షణ ఎంతో ముఖ్యమైనది. గర్భిణీలు సమయానికి పోషకాహారం తీసుకోవడం, క్రమం తప్పకుండా వైద్య పరీక్షలు చేయించుకోవడం ద్వారా తల్లి-బిడ్డ ఇద్దరూ ఆరోగ్యంగా ఉంటారు అని సూచించారు. మహిళా సమన్వయకర్త బొడ్డపాటి శైలజ మాట్లాడుతూ వేసవి కాలంలో గర్భిణీలు శరీరంలో నీటి శాతం తగ్గకుండా జాగ్రత్తలు తీసుకోవాలని, మంచినీరు, కొబ్బరినీరు, బార్లీ వంటి ద్రవ పదార్థాలు ఎక్కువగా తీసుకోవాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో స్టాఫ్ నర్స్ శ్రీమతి విక్టోరియా, సేవా సమితి సభ్యులు బొడ్డపాటి అంజనాదేవి, డేగ రమాదేవి, బొడ్డపాటి మౌనిక, ఎం. భవాని, కొట్టే నాగమణి, కొల్లిపర సాయి మోహిని,మెడికల్ విభాగ సమన్వయకర్త పి. వరప్రసాద్‌తో పాటు పలువురు వైద్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. హాజరయ్యారు.

