[addtoany]
మచిలీపట్నం :
ఏప్రిల్ 18వ తేదీ శనివారం జిల్లా వ్యాప్తంగా స్వర్ణాంధ్ర స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమంలో భాగంగా జలం జీవం ఇతివృత్తంతో పెద్ద ఎత్తున కార్యక్రమాలు నిర్వహించి విజయవంతం చేయాలని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ అధికారులను ఆదేశించారు. శుక్రవారం మధ్యాహ్నం జిల్లా కలెక్టర్ నగరంలోని వారి క్యాంపు కార్యాలయం నుండి స్వర్ణాంధ్ర స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమంపై జిల్లా అధికారులు, క్షేత్ర అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి దిశా నిర్దేశం చేశారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ప్రతి మూడవ శనివారం ఒక ఇతివృత్తాన్ని (థీమ్) ఎంపిక చేసుకొని స్వర్ణాంధ్ర స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామన్నారు. ఈ నెలకు జలం జీవం ఆంధ్ర ఇతివృత్తంతో కార్యక్రమాలు చేపట్టాలని ప్రభుత్వం ఆదేశించిందన్నారు.
ఇందులో భాగంగా గ్రామాల్లో తిరిగి వర్షపు నీటి ప్రతి బొట్టును ఓడిసిపట్టేందుకు అన్ని చర్యలు చేపట్టాలన్నారు. ఇందుకోసం కోనేటి గుంతలు, నీటి తొట్లు, పర్కులేషన్ ట్యాంకులు తదితర వర్షపు నీటి నిలువ నిర్మాణాలు ఏమున్నాయి గమనించుకొని అవసరమైన ప్రదేశంలో వాటి నిర్మాణ పనులు చేపట్టాలన్నారు. జిల్లాలో 250 చెరువులను ఉపాధి హామీ పథకం కింద పూడికలు తీసే పనులను మంజూరు చేశామని, అలాగే సప్లై ఛానల్ పూడికలు కూడా తీసేందుకు చర్యలు చేపట్టాలన్నారు. అన్ని జల వనరులు పరిశుభ్రంగా నిర్వహించాలని, వాటి చుట్టూ మొక్కలు నాటే కార్యక్రమం చేపట్టాలన్నారు. అవసరమైన చోటల్లా ఇంకుడు గుంతలు తవ్వాలని ఎక్కడ కూడా మురికినీరు పొరలి రహదారి పైన ప్రవహించకుండా చూడాలన్నారు.
ఎక్కడైనా మురికి కాలువలు అసంపూర్తిగా ఉంటే వాటిని పూర్తి చేసి వర్షాలు వచ్చినప్పుడు ఇబ్బందులు లేకుండా ముందుగానే పక్కా మురికి కాలువ గాని లేదా కచ్చా మురికి కాలువ గాని ఏర్పాటు చేయాలన్నారు. ప్రభుత్వ భవనాలలో సజావుగా లేని వర్షపు నీటి నిల్వ నిర్మాణాలను మరమ్మతు చేయించాలని వచ్చే వర్షాకాలం నాటికి ఎలాంటి ఇబ్బంది లేకుండా చర్యలు చేపట్టాలన్నారు.
తదుపరి స్వచ్ఛ సర్వేక్షన్ కార్యక్రమాలను పరిశీలించాలన్నారు. ఇందులో భాగంగా గ్రామాల్లో 250 కుటుంబాలకు ఒక క్లాప్ మిత్రలను ఏర్పాటు చేశామని, క్లాప్ మిత్రాలు కనీసం ఒక టన్ను చెత్త తీసుకొని వస్తేనే వారికి జీతాలు ఇవ్వాల్సి ఉంటుందన్నారు. వారు ఇంటింటికి తిరిగి చెత్తను సేకరిస్తున్నారా లేదా అని గ్రామస్తులతో విచారించాలన్నారు.
మండల ప్రత్యేక అధికారులు స్వర్ణ ఆంధ్ర స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమం లో పాల్గొన్న అనంతరం గ్రామంలోని ప్రభుత్వ సంక్షేమ వసతి గృహాలు, పాఠశాలలను సందర్శించి అక్కడ ఇంకుడు గుంతలు గాని, కాంపోస్టు గుంతలు గాని ఉన్నాయా లేదా గమనించి లేనిపక్షంలో వాటి ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలన్నారు.
తదుపరి గ్రామంలో రీ సర్వే ప్రక్రియ గురించి ఆరా తీయాలని సంబంధిత రైతులు, సాగుదారులకు రెవెన్యూ శాఖ నుండి నోటీసులు అందాయా లేదా వాళ్లకు తెలిసే సర్వే జరిగిందా లేదా అనే వివరాలు తెలుసుకోవాలన్నారు.
మండల విద్యాధికారులు, పాఠశాల ప్రత్యేక అధికారులు ఉన్నత పాఠశాలను సందర్శించి పదవ తరగతి విద్యార్థులతో ముఖాముఖి మాట్లాడి వారు ఉదయం 5 గంటలకే నిద్రలేస్తున్నారా లేదా చదువుకుంటున్నారా లేదా అని విచారించాలన్నారు. వారిని ఆ దిశగా మరొకసారి చైతన్య పరచాలన్నారు.
అంతేకాకుండా వారు ఉపాధ్యాయులతో సమావేశం నిర్వహించి నూటికి నూరు శాతం ఫలితాలు సాధించే విధంగా ప్రణాళిక రూపొందించుకునేటట్లు మార్గనిర్దేశం చేయాలన్నారు. ఫౌండేషనల్ లిటరసి న్యూమరసి (ఎఫ్ ఎల్ ఎన్) వాలంటీర్లు ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు ఏమేరకు చదువు నేర్పుతున్నారో గమనించాలన్నారు.
ఈ వీడియో కాన్ఫరెన్స్ లో జెడ్పి సిఈఓ డాక్టర్ జె అరుణ, జలవనురుల శాఖ ఎస్ ఈ గుణకర్, డ్వామా పిడి శివప్రసాద్, మండల ప్రత్యేక అధికారులుగా ఉన్న జిల్లా అధికారులు, డి ఎల్ డి వో లు, ఎంపీడీవోలు,తహసిల్దార్లు, జలవనరుల శాఖ ఇంజనీర్లు, ఏ పీ డి లు,ఏపీవోలు ఎంఈఓ లు తదితర అధికారులు పాల్గొన్నారు.

