జనాభా లెక్కల సేకరణ ఎలాంటి తప్పులు లేకుండా వాస్తవాలను ప్రతిబింబించే విధంగా ఉండాలని జిల్లా కలెక్టర్ జిల్లా జనాభా లెక్కల అధికారి డీకే బాలాజీ అధికారులను ఆదేశించారు. సోమవారం ఉదయం జిల్లా కలెక్టర్ నగరంలోని కలెక్టరేట్ విసి హాల్లో జనాభా లెక్కల సేకరణ పై క్షేత్రస్థాయిలో ట్రైనర్లు అయిన ఉపాధ్యాయులకు శిక్షణ తరగతులు నిర్వహించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జనాభా లెక్కల సేకరణ చాలా ముఖ్యమైన కార్యక్రమం అన్నారు. జనాభా లెక్కలు సేకరించే సమయంలో చాలా జాగ్రత్తగా విధులు నిర్వహించాలన్నారు. కేంద్ర ప్రభుత్వం ఏమైనా నిర్ణయాలు తీసుకోవాలంటే జనాభా లెక్కల ఆధారంగా తీసుకోవడం జరుగుతుందన్నారు. కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వానికి నిధులు ఇచ్చే విషయంలో ఈ జనాభా లెక్కలు ఎంతో ఉపయోగపడతాయన్నారు.ఎన్ని రకాల సర్వేలు ఉన్నప్పటికీ జనాభా లెక్కల వివరాల సేకరణ చాలా ముఖ్యమన్నారు. తప్పులు లేకుండా సజావుగా జనాభా లెక్కలు సేకరించాలన్నారు.వాస్తవాలు చెబితే ప్రస్తుతం పొందుతున్న పథకాల ప్రయోజనాలు దూరం అవుతాయని అపోహ కొందరిలో ఉంటుందన్నారు. కానీ నిజానికి అటువంటిది ఏమీ ఉండదని ధైర్యంగా ప్రజలు వారి వివరాలను తెలియజేయాలన్నారు.జనాభా లెక్కల సేకరణ లో కేవలం లెక్కలు, అంకెలు మాత్రమే ఉంటాయని ఇతరత్రా మనుషుల పేర్లు ఉండవని కలెక్టర్ స్పష్టం చేశారు. ఉదాహరణకు వాయు కాలుష్యం తగ్గించాలన్న, రహదారుల విస్తరణ చేయాలన్న వాహనాల వివరాలు వాటి సంఖ్య అవసరం ఉంటుందని అదే గనుక ఆ వివరాలు ఇవ్వకపోయినా నిధులు మనకు రాకుండా పోయే అవకాశం ఉందన్నారు.
జనాభా లెక్కల సేకరణకు ఓటు హక్కుకు ఎలాంటి సంబంధం లేదని నిర్భయంగా ప్రజలు వారి వివరాలను ఎన్యుమరేటర్లకు తెలియజేయాలన్నారు.ఈ తరగతుల్లో జనాభా లెక్కల సేకరణ రాష్ట్ర అదనపు సంచాలకులు ప్రసన్న కుమార్, డిఆర్వో చంద్రశేఖర రావు,, జిల్లా మాస్టర్ ట్రైనర్లు డిటిడబ్ల్యువో ఫణి ధూర్జటి, కృష్ణ విశ్వ విద్యాలయం ఆచార్య శ్రావణి, శిక్షణ పొందుతున్న పలువురు ఉపాధ్యాయులు పాల్గొన్నారు.