[addtoany]
జిల్లా స్థాయి ఇఫ్తార్ లో పాల్గొన్న మంత్రి కొల్లు రవీంద్ర, జిల్లా కలెక్టర్ డీకే బాలాజి, ఏపీఎస్ఆర్టీసీ చైర్మన్ కొనకళ్ళ నారాయణరావు తదితరులు
మచిలీపట్నం:
రాష్ట్ర ప్రభుత్వం మైనారిటీల సంక్షేమానికి అత్యంత ప్రాధాన్యతనిస్తోందని, రాష్ట్రంలోని ముస్లిం సోదరుల అభివృద్ధికి అన్ని విధాల కృషి చేస్తున్నామని రాష్ట్ర గనులు భూగర్భవనరులు ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర పేర్కొన్నారు.
నగరంలోని జిల్లా పరిషత్ కన్వెన్షన్ హాల్లో జిల్లా మైనారిటీల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో బుధవారం ఏర్పాటు చేసిన జిల్లా స్థాయి ఇఫ్తార్ లో మంత్రి, జిల్లా కలెక్టర్ డీకే బాలాజి, ఏపీఎస్ఆర్టీసీ చైర్మన్ కొనకళ్ళ నారాయణరావుతో కలిసి పాల్గొన్నారు. వారు ముస్లిం సోదరులతో కలిసి ప్రార్థనలు నిర్వహించి, అందరికీ రంజాన్ మాస శుభాకాంక్షలు తెలియజేశారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రంజాన్ మాసం త్యాగం, సహనానికి ప్రతీక అని, సమాజంలో ఐక్యత, ప్రేమ, సౌబ్రాతృత్వాన్ని పెంపొందించే పర్వదినమని తెలిపారు. ముస్లిం సోదరుల ప్రార్థనలు సర్వ మానవాళికి రక్షణ కలిగిస్తాయని అన్నారు. ముస్లిం సోదరులందరూ అత్యంత పవిత్రంగా, ఎంతో నిష్టతో రంజాన్ మాసాన్ని పాటిస్తారన్నారు. సూర్యోదయానికి ముందు (సహర్) నుండి సూర్యాస్తమయం (ఇఫ్తార్) వరకు అన్నపానీయాలు మాని, కఠినమైన ఉపవాసం పాటించటం గొప్ప విషయమని పేర్కొన్నారు.
కూటమి ప్రభుత్వం వచ్చాక ఇమామ్ లు, మౌజన్ లకు దాదాపు రూ.180 కోట్లు చెల్లించిందని, అలాగే మసీదులు, దర్గాల మరమ్మతుల కోసం నిధులు విడుదల చేయడం జరిగిందన్నారు. ముస్లిం సోదరులు పవిత్రంగా భావించే హజ్ యాత్ర కోసం విజయవాడలో హజ్ భవనం నిర్మాణ పనులు నాడు 2014 – 19 కాలంలో ప్రారంభించామని, తర్వాత అది నిర్లక్ష్యానికి గురైందని, ప్రస్తుతం తిరిగి ఆ భవనాన్ని పూర్తి చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టిందని తెలిపారు. కడపలో కూడా దర్గా నిర్మాణానికి చర్యలు చేపట్టినట్లు తెలిపారు. ముస్లిం మైనారిటీల సంక్షేమానికి బడ్జెట్లో 6,090 కోట్లకు పైగా కేటాయింపులు చేశామని మంత్రి ఈ సందర్భంగా గుర్తు చేశారు.
జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం, ఒక కుటుంబం ఒక వ్యాపారవేత్త అనే నినాదంతో ముందుకు సాగుతోందని, ముస్లిం సోదరులలో ఎవరైనా వ్యాపారవేత్తలు కావడానికి ముందుకొస్తే వారికి ప్రభుత్వం తరుపున అన్ని విధాల ఆర్థిక తోడ్పాటు అందిస్తామన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ముస్లిం సోదరులకు రంజాన్ శుభాకాంక్షలు తెలియజేశారు.
ఏపీఎస్ఆర్టీసీ చైర్మన్ కొనకళ్ళ నారాయణరావు మాట్లాడుతూ ప్రపంచ శాంతి, ఐక్యత, మానవత్వానికి ప్రతీకగా రంజాన్ మాసాన్ని ముస్లిం సోదరులు ఎంతో పవిత్రంగా పాటిస్తారని పేర్కొంటూ వారందరికీ రంజాన్ మాస శుభాకాంక్షలు తెలియజేశారు.
కార్యక్రమంలో గవర్నమెంట్ ఖాజీ మహమ్మద్ హుస్సేన్, జామియా మసీద్ ఇమామ్ రఫీక్ హాలాం, జిల్లా సహకార మార్కెటింగ్ సొసైటీ చైర్మన్ బండి రామకృష్ణ, గౌడ కార్పొరేషన్ చైర్మన్ వీరంకి వెంకట గురుమూర్తి, రాష్ట్ర మైనారిటీ డైరెక్టర్ హసీం బేగ్, అర్బన్ బ్యాంక్ చైర్మన్ దిలీప్ కుమార్, బ్రాహ్మణ కార్పొరేషన్ డైరెక్టర్ ఫణి కుమార్, జిల్లా మైనారిటీల సంక్షేమ శాఖ అధికారి రబ్బానీ, జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ గొర్రెపాటి గోపీచంద్, మాజీ మున్సిపల్ చైర్మన్ మోటమర్రి బాబా ప్రసాద్, జెడ్పీ సీఈవో కే కన్నమనాయుడు, డిప్యూటీ సీఈవో డాక్టర్ ఆనంద్ కుమార్, బందరు ఆర్డీవో కే సాంబశివరావు, ముస్లీం మత పెద్దలు అబ్దుల్ అజీమ్, కాజా తదితర మత పెద్దలు ఇలియాస్ పాషా తదితరులు పాల్గొన్నారు.

