MachilipatnamLocal News
January 14, 2026
కృష్ణా జిల్లా

పెండింగ్ అర్జీలపై ప్రత్యేక దృష్టి పెట్టాలి –– జాయింట్ కలెక్టర్

  • January 13, 2026
  • 0 min read
[addtoany]
పెండింగ్ అర్జీలపై ప్రత్యేక దృష్టి పెట్టాలి –– జాయింట్ కలెక్టర్
మచిలీపట్నం :
 
ప్రజా సమస్యల పరిష్కార వేదిక పెండింగ్ అర్జీలపై ప్రత్యేక దృష్టి పెట్టి పరిష్కారానికి కృషి చేయాలని జాయింట్ కలెక్టర్ ఎం నవీన్ అధికారులను ఆదేశించారు. సోమవారం ఉదయం ఆయన కలెక్టరేట్ లోని పిజిఆర్ఎస్ సమావేశపు మందిరంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక మీకోసం కార్యక్రమం నిర్వహించారు. ఇంచార్జి డీఆర్ఓ కేఆర్ఆర్సీ స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ శ్రీదేవి, బందరు డీఎస్పీ చప్పిడి రాజా, మెప్మా పీడీ సాయిబాబుతో కలిసి జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజల వద్ద నుంచి అర్జీలు స్వీకరించారు. అనంతరం ఆయన అధికారులతో మాట్లాడుతూ పంచాయతీ రాజ్ వద్ద 272 అర్జీలు, పోలీస్ 72, విద్యుత్ శాఖ వద్ద 56 అర్జీలు అత్యధికంగా పెండింగ్లో ఉన్నాయని, దీనిపై సంబంధిత అధికారులు ప్రత్యేక శ్రద్ధ పెట్టాలన్నారు. ప్రతిరోజు సాయంత్రం విధులు ముగించుకుని ఇంటికి వెళ్లే ముందు వచ్చిన అర్జీలపై తప్పనిసరిగా సమీక్షించుకుని వెళ్లాలని సూచించారు. ఎండార్స్మెంట్ సరైన రీతిలో చేయకపోతే అర్జీలు ఓపెన్ అవుతున్నాయని, సక్రమంగా చేయాలని చెబుతూ మండల స్థాయి అర్జీలను సైతం పర్యవేక్షించాలని చెప్పారు. కొంతమంది అధికారులు ప్రజా సమస్యల పరిష్కార వేదిక మీకోసం కార్యక్రమానికి గైర్హాజరవుతున్నారని, అలాంటి వారిని గుర్తించి షోకాస్ నోటీస్ జారీ చేయాలని అధికారులకు సూచించారు.
 
అర్జీలలో కొన్ని: 
కూడబెట్టుకున్న డబ్బుతో 300 మంది పోస్ట్ ఆఫీస్ నందు పొదుపు చేసుకున్నామని, అయితే మా గ్రామ పోస్టుమ్యాన్ ఆ నగదును మా ఖాతాల్లో జమ చేయకుండా మోసం చేసి నగదు, పాస్ పుస్తకాలతో పరారయ్యాడని, ప్రస్తుతం పోలీసులు పట్టుకున్న ఆ పోస్టు మ్యాన్ నుంచి నగదును ఇప్పించేందుకు తగిన చర్యలు తీసుకోవాల్సిందిగా ఉంగుటూరు మండలం, ఉంగుటూరు గ్రామానికి చెందిన పలువురు మహిళలు అర్జీ సమర్పించారు. భర్త మరణించి వృద్ధురాలైన తనకు ఇద్దరు మగ పిల్లలు, ఒక ఆడపిల్ల సంతానం కలదని, వారందరికీ ఆస్తి పంపకాలు చేశానని, అయితే తన బాగోగులు పట్టించుకోకుండా ఆస్తుల రిజిస్ట్రేషన్ కోసం తనపై ఒత్తిడి పెట్టి ఇబ్బందులు పెడుతున్నారని, న్యాయం చేయాలని జాయింట్ కలెక్టర్ ను కోరగా, దీనిపై తగిన చర్యలు తీసుకోవాలని మచిలీపట్నం ఆర్టీవోకు సూచించారు. మచిలీపట్నం ప్రభుత్వ ఆసుపత్రికి వైద్యం నిమిత్తం వివిధ ప్రాంతాల నుంచి పేద, మధ్య తరగతికి చెందిన వందలాది మంది రోగులు నిత్యం వస్తున్నారని, చుట్టుపక్కల ప్రాంతాల్లో భోజన మెస్సులు ఏవి లేవని, పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని ఆ ప్రాంతంలో అన్న క్యాంటీన్ ఏర్పాటు చేసే విధంగా చర్యలు తీసుకోవాల్సిందిగా మచిలీపట్నంకు చెందిన సైకం భాస్కర్ రావు అర్జీ ఇచ్చారు.
కార్యక్రమంలో జెడ్పీ సీఈవో కన్నమనాయుడు, ఆర్ అండ్ బి ఈఈ లోకేష్, ఉద్యాన శాఖ అధికారిణి జే జ్యోతి, జిల్లా పౌర సరఫరాల అధికారి జి మోహన్ రావు, పౌర సరఫరాల సంస్థ జిల్లా మేనేజర్ టి శివరాం ప్రసాద్, ఐసిడిఎస్ పిడి ఎంఎన్ రాణి, మార్క్ ఫెడ్ డీఎం మురళీ కిషోర్, ఎల్డిఎం రవీంద్రారెడ్డి, ఆర్డబ్ల్యూఎస్ అధికారి సోమశేఖర్, పశుసంవర్ధక శాఖ అధికారి చిన నరసింహులు తదితర శాఖల అధికారులు పాల్గొన్నారు.
About Author

SSN

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *