MachilipatnamLocal News
November 23, 2026
జిల్లా

నిత్యావసరాలను అధిక ధరలకు విక్రయిస్తే సహించేది లేదు: కృష్ణా జిల్లా పౌరసరఫరాల అధికారి హెచ్చరిక

  • November 22, 2026
  • 1 min read
నిత్యావసరాలను అధిక ధరలకు విక్రయిస్తే సహించేది లేదు: కృష్ణా జిల్లా పౌరసరఫరాల అధికారి హెచ్చరిక

మచిలీపట్నం:

బహిరంగ మార్కెట్‌లో బియ్యం ధరలు పెరుగుతున్న నేపథ్యంలో ధరల నియంత్రణపై కృష్ణా జిల్లా యంత్రాంగం కఠిన చర్యలకు ఉపక్రమించింది. నిత్యావసర వస్తువులను అధిక ధరలకు విక్రయించినా, వ్యాపారంలో అవకతవకలకు పాల్పడినా కఠిన చర్యలు తప్పవని కృష్ణా జిల్లా పౌరసరఫరాల అధికారి టి. శివరామ ప్రసాద్ హెచ్చరించారు. రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయం మేరకు, కృష్ణా జిల్లా జాయింట్ కలెక్టర్ ఆదేశాల ప్రకారం జిల్లా పౌరసరఫరాల అధికారి జిల్లాలోని పలు హోల్‌సేల్ దుకాణాలు, బిగ్ చైన్ మార్కెట్లను ఆకస్మికంగా తనిఖీ చేశారు. అనంతరం వ్యాపారులు, బిగ్ చైన్ మార్కెట్ల యజమానులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు.

అక్రమ నిల్వలు, కృత్రిమ కొరతపై ఉక్కుపాదం
ధాన్యం, బియ్యం మార్కెట్‌లో అక్రమ నిల్వలు, కృత్రిమ కొరత మరియు అన్యాయమైన ధరల పెరుగుదలను అరికట్టడమే రాష్ట్ర ప్రభుత్వ ఉత్తర్వుల ముఖ్య ఉద్దేశ్యమని అధికారి స్పష్టం చేశారు. వినియోగదారుల ప్రయోజనాలను కాపాడేందుకు వ్యాపార కార్యకలాపాల్లో పూర్తి పారదర్శకత ఉండాలన్నారు. బియ్యం మరియు ధాన్యం వ్యాపారులు, హోల్‌సేల్ వ్యాపారులు, కమిషన్ ఏజెంట్లు, బిగ్ చైన్ రిటైలర్లు, రైస్ మిల్లర్లు మరియు ప్రాసెసర్లు ఈ ఉత్తర్వుల పరిధిలోకి వస్తారని తెలిపారు. ఈ వ్యాపార సంస్థలన్నీ నిర్దేశిత గడువులోగా సంబంధిత సమర్థ అధికారి వద్ద తప్పనిసరిగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలని, కొత్తగా వ్యాపారం ప్రారంభించే వారు ముందుగానే రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తి చేయాలని ఆదేశించారు.

G.O.Ms.No.18 ప్రకారం నిల్వ పరిమితులు

ప్రభుత్వ ఉత్తర్వుల (G.O.Ms.No.18) ప్రకారం వివిధ వ్యాపార వర్గాలకు నిల్వ పరిమితులను నిర్దేశించారు. దీని ప్రకారం ట్రేడింగ్ రైస్ మిల్లులకు 4,000 క్వింటాళ్లు లేదా 7 రోజుల మిల్లింగ్ సామర్థ్యానికి సమానమైన నిల్వలో ఏది ఎక్కువైతే అది పరిమితిగా ఉంటుంది (CMR మరియు ప్రభుత్వ ఆధీనంలోని నిల్వలకు దీని నుండి మినహాయింపు ఉంది). ఇక హోల్‌సేల్ వ్యాపారుల విషయానికి వస్తే జిల్లా కేంద్రంలో  1,000 క్వింటాళ్లు, జిల్లా కేంద్రాల్లో  500 క్వింటాళ్లు, ఇతర ప్రాంతాల్లో 250 క్వింటాళ్ల వరకు నిల్వ ఉంచుకోవచ్చు. అలాగే రిటైలర్లకు పట్టణ ప్రాంతాల్లో 100 క్వింటాళ్లు, గ్రామీణ ప్రాంతాల్లో 50 క్వింటాళ్లు గరిష్ఠ నిల్వ పరిమితిగా నిర్ణయించారు.

ఆన్‌లైన్ స్టాక్ నమోదు & 36 కేసులు నమోదు

సంబంధిత వ్యాపారులందరూ కేంద్ర ప్రభుత్వ పోర్టల్ (foodstock.dfpd.gov.in) ద్వారా ప్రతి శుక్రవారం తమ స్టాక్ వివరాలను తప్పనిసరిగా అప్‌డేట్ చేయాలని ఆదేశించారు. ధాన్యం, వివిధ రకాల బియ్యం నిల్వలను విడివిడిగా, కచ్చితంగా నమోదు చేయాలని, తప్పుడు లేదా తప్పుదారి పట్టించే వివరాలు ఇస్తే కఠిన చర్యలు తప్పవని స్పష్టం చేశారు. కాగా, జిల్లావ్యాప్తంగా నిర్వహించిన తనిఖీల్లో ఇప్పటివరకు నిబంధనలు ఉల్లంఘించిన వారిపై 36 కేసులు నమోదు చేసి జరిమానాలు విధించినట్లు తెలిపారు.

ప్రభుత్వం నిర్ణయించిన గరిష్ఠ బియ్యం ధరలు
ప్యాకింగ్ చేసిన బియ్యం సంచులపై ప్రభుత్వం నిర్ణయించిన గరిష్ఠ ధరలను వినియోగదారులకు స్పష్టంగా కనిపించేలా ప్రదర్శించాలని, అధిక ధరలు వసూలు చేయకూడదని టోకు, చిల్లర వ్యాపారులకు సూచించారు. ప్రభుత్వం నిర్ణయించిన ధరల ప్రకారం కిలో జై శ్రీరామ్ బియ్యం రూ.82 కాగా, హెచ్‌ఎంటీ (HMT) మరియు ఆర్‌ఎన్‌ఆర్ (RNR) రకాల బియ్యం కిలో రూ.76 గా నిర్ణయించారు. అలాగే బీపీటీ 3291 (సోనా), బీపీటీ 5204 (సాంబ) మరియు కేఎన్ఎం (KNM) రకాల బియ్యం ధరలు కిలో రూ.66 కాగా, ఎంటీయూ కాటన్ వెరైటీ (MTU) బియ్యం ధర కిలో రూ.47 గా నిర్ణయించినట్లు తెలిపారు.

రూ.1300 కే 26 కేజీల ‘ధరణి రైస్’

అనంతరం జిల్లాలోని రేషన్ షాపుల అధ్యక్షులు, ఉపాధ్యక్షులు మరియు సివిల్ సప్లయ్స్ డిప్యూటీ తహసీల్దార్లతో (CS DTs) డీఎస్ఓ సమీక్షా సమావేశం నిర్వహించారు. బహిరంగ మార్కెట్‌లో ధరలు ఎక్కువగా ఉన్నప్పటికీ, పేదలకు నాణ్యమైన బియ్యాన్ని అందించేందుకు ప్రభుత్వం ‘ధరణి రైస్’ పథకాన్ని అమలు చేస్తోందన్నారు. ప్రత్యేక ప్యాకింగ్‌తో కూడిన 26 కేజీల బియ్యం బస్తా కేవలం రూ.1,300 కే రేషన్ కార్డుదారులకు అందుబాటులో ఉందని తెలిపారు. జిల్లాలో ఇప్పటివరకు 3,711 మంది వినియోగదారులకు 928.72 క్వింటాళ్ల KNM రకం బియ్యం, 68.90 క్వింటాళ్ల BPT రకం బియ్యం కలిపి మొత్తం 997.62 క్వింటాళ్ల బియ్యం విక్రయించినట్లు వెల్లడించారు. అలాగే లబ్ధిదారుల మొబైల్ నంబర్ల అప్‌డేషన్ ప్రక్రియను వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు.

About Author

SSN