గాంధీ బొమ్మ శివాలయంలో వైభవంగా సామూహిక సత్యనారాయణ స్వామి వ్రతాలు, అన్నసమారాధన
మచిలీపట్నం:
కార్తీక మాస ద్వాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని శనివారం స్థానిక శ్రీ మహిషాసుర మర్ధిని సమేత కాశీ విశ్వేశ్వర స్వామి దేవాలయం (గాంధీ బొమ్మ శివాలయం)లో ప్రత్యేక ఆధ్యాత్మిక కార్యక్రమాలు భక్తిశ్రద్ధలతో జరిగాయి. ఈ సందర్భంగా సుమారు 80 మంది దంపతులతో సామూహిక శ్రీ రమాసహిత సత్యనారాయణ స్వామి వ్రతాలు మరియు దామోదర పూజా కార్యక్రమాలను వైభవంగా నిర్వహించారు. వ్రతంలో పాల్గొన్న 80 మంది దంపతులకు ‘శ్రీ గణపతి దత్త సాయి సేవ సంఘం’ ఆధ్వర్యంలో భక్తిపూర్వకంగా కానుకలు అందజేశారు.
ఆలయ స్థానాచార్యులు జొన్నలగడ్డ వాసు, జొన్నలగడ్డ సాయి, ప్రధాన అర్చకులు చేబ్రోలు సాయి రామ్ కుమార్, కందుకూరి చిట్టిబాబు, గట్టుపల్లి సాయిచరణ్ శర్మ బృందం శాస్త్రోక్తంగా ఈ పూజలను జరిపించారు. అనంతరం మధ్యాహ్నం 12:30 గంటల నుంచి నిర్వహించిన కార్తీక మహా అన్నసమారాధనలో భక్తులు, స్థానికులు పెద్ద సంఖ్యలో పాల్గొని అన్నప్రసాదం స్వీకరించారు.
ఆలయ కమిటీ సభ్యులు తమ్మన రాధాకృష్ణ మూర్తి, ఎండూరి సురేష్, చేబ్రోలు నాగలక్ష్మి గాయత్రి, నంబుల వాసు, కొల్లిపర బాలాజీ దుర్గా ప్రసాద్, తమ్మన పాండురంగ నారాయణ, నంబూరి శ్రీనివాస్, దేసు సూర్యప్రకాశరావు, పువ్వాడ నాగ వెంకట సత్యనారాయణ తదితరులు ఈ కార్యక్రమ ఏర్పాట్లను పర్యవేక్షించారు.

