నిర్మల హై స్కూల్‌లో న్యాయ విజ్ఞాన అవగాహన సదస్సు
మచిలీపట్నం :
జాతీయ న్యాయ సేవాధికార సంస్థ (NALSA) మరియు సుప్రీంకోర్టు మార్గదర్శకాల ప్రకారం, కృష్ణా జిల్లా న్యాయ సేవాధికార సంస్థ (DLSA) ఆధ్వర్యంలో పాఠశాల విద్యార్థులకు నిర్వహిస్తున్న న్యాయ విజ్ఞాన అవగాహన సదస్సులు కొనసాగుతున్నాయి. శనివారం డీఎల్ఎస్ఏ ఆధ్వర్యంలో స్థానిక నిర్మల హై స్కూల్ లో అవగాహన సదస్సు జరిగింది.
ఈ సందర్భంగా బాలల హక్కులు, రక్షణ కోసం ఉద్దేశించిన ‘సురక్షిత బచ్‌పన్ అభియాన్’, లైంగిక వేధింపుల నిరోధక చట్టం గురించి విద్యార్థులకు క్షుణ్ణంగా వివరించారు. అలాగే మాదకద్రవ్యాల వినియోగం వల్ల కలిగే అనర్థాలపై ‘నాల్సా డాన్ స్కీమ్’ ద్వారా విద్యార్థులను చైతన్యపరిచి, మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని సూచించారు.
ఈ అవగాహన కార్యక్రమాలలో డీఎల్ఎస్ఏ న్యాయవాదులు సోగన క్రాంతి శ్రీ, పూల సాయికుమార్ పాల్గొని విద్యార్థులకు చట్టాలపై అవగాహన కల్పించారు. నిర్మల హై స్కూల్ ప్రిన్సిపల్, విద్యార్థులు ఈ సదస్సులో పాల్గొన్నారు.

