ఉచిత న్యాయ సేవలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలి: జిల్లా ప్రధాన న్యాయమూర్తి డాక్టర్ సి. యామిని
మచిలీపట్నం:
ఉచిత న్యాయ సహాయ సేవలను ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలని, చట్టాలపై అవగాహన పెంపొందించుకోవడంతో పాటు లోక్ అదాలత్, మధ్యవర్తిత్వం ద్వారా వివాదాలను సత్వరమే పరిష్కరించుకోవాలని కృష్ణా జిల్లా ప్రధాన న్యాయమూర్తి డాక్టర్ సి. యామిని సూచించారు. జాతీయ న్యాయ సేవల దినోత్సవం సందర్భంగా సోమవారం జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో న్యాయ సేవా సదన్ నుంచి జిల్లా కోర్టు సెంటర్ వరకు భారీ అవగాహన ర్యాలీ మరియు మానవహారం నిర్వహించారు. వృద్ధులు, చిన్నారులు, దివ్యాంగులు, అసంఘటిత రంగ కార్మికులకు న్యాయ సహాయంతో పాటు సంక్షేమ పథకాలు పొందేందుకు జాతీయ న్యాయ సేవాధికార సంస్థ నిరంతరం కృషి చేస్తోందని ఈ సందర్భంగా ఆమె పేర్కొన్నారు.
రాబోయే డిసెంబర్ 12వ తేదీన నిర్వహించనున్న జాతీయ లోక్ అదాలత్‌ను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని, రాజీకి అనుకూలమైన సివిల్, కాంపౌండబుల్ క్రిమినల్ కేసులను పరిష్కరించుకోవచ్చని వివరించారు. అలాగే ‘మధ్యవర్తిత్వం 3.0’ ద్వారా ఇప్పటివరకు 140కి పైగా కేసులు పరిష్కారమయ్యాయని, కోర్టుల వరకు రాని వివాదాలను సైతం కమ్యూనిటీ మధ్యవర్తిత్వం ద్వారా పరిష్కరించుకోవచ్చని తెలిపారు. ఈ కార్యక్రమంలో పోక్సో కోర్టు న్యాయమూర్తి జి. వెంకటేశ్వర్లు, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి ఎస్. వరలక్ష్మి, పలువురు న్యాయమూర్తులు, న్యాయవాదులు, కోర్టు సిబ్బంది మరియు పారా లీగల్ వాలంటీర్లు పాల్గొన్నారు.

