MachilipatnamLocal News
October 22, 2026
జిల్లా

మున్సిపల్ ఎన్నికల పోలింగ్: ఈ నెల 28న స్థానిక సెలవు ప్రకటన

  • October 18, 2026
  • 0 min read
మున్సిపల్ ఎన్నికల పోలింగ్: ఈ నెల 28న స్థానిక సెలవు ప్రకటన

మచిలీపట్నం:

కృష్ణా జిల్లాలో పట్టణ స్థానిక సంస్థల ఎన్నికల పోలింగ్ సందర్భంగా ఈ నెల 28వ తేదీన స్థానిక సెలవు ప్రకటిస్తున్నట్లు జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి డీకే బాలాజి తెలిపారు. మచిలీపట్నం నగరపాలక సంస్థతో పాటు పెడన, ఉయ్యూరు మున్సిపాలిటీల్లో బుధవారం నిర్వహించనున్న ఎన్నికలలో ఓటర్లు తమ ఓటు హక్కును స్వేచ్ఛగా వినియోగించుకునేందుకు వీలుగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన వెల్లడించారు.

అన్ని సంస్థలకు వర్తింపు:

మున్సిపల్ పరిపాలన, పట్టణాభివృద్ధి శాఖ ఉత్తర్వుల మేరకు ఎన్నికలు జరిగే ప్రాంతాల్లోని ప్రభుత్వ కార్యాలయాలు, స్థానిక సంస్థలతో పాటు ప్రభుత్వ, ప్రైవేటు విద్యాసంస్థలు, వ్యాపార సంస్థలకు ఈ సెలవు వర్తిస్తుందన్నారు. దుకాణాలు, ఇతర ప్రైవేటు సంస్థల్లో పనిచేసే ఉద్యోగులకు పోలింగ్ రోజున వేతనంతో కూడిన సెలవు ఇవ్వాలని, నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్స్ చట్టం ప్రకారం కూడా సెలవు అమలులో ఉంటుందని స్పష్టం చేశారు. అలాగే పోలింగ్ కేంద్రాలుగా ఉన్న భవనాలు, విద్యాసంస్థలకు పోలింగ్ ముందు రోజు, పోలింగ్ రోజు మరియు ఓట్ల లెక్కింపు రోజున స్థానిక సెలవు ఉంటుందని తెలిపారు.

ఈ ఉత్తర్వులను తక్షణమే అమలు చేయాలని జిల్లా విద్యాశాఖాధికారి, ఇంటర్మీడియట్ విద్యాధికారి, కృష్ణా విశ్వవిద్యాలయం రిజిస్ట్రార్ మరియు విద్యాసంస్థల అధిపతులను కలెక్టర్ ఆదేశించారు. ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు ఎంతో విలువైనదని, అర్హులైన ఓటర్లందరూ తప్పనిసరిగా ఓటు వేసి ఎన్నికల ప్రక్రియలో భాగస్వాములు కావాలని ఈ సందర్భంగా ఆయన విజ్ఞప్తి చేశారు.

About Author

SSN