హోరా హోరీగా మున్సిపల్ ఎన్నికల నామినేషన్లు
మచిలీపట్నం:
మచిలీపట్నం నగరపాలక సంస్థకు ఈ నెల 28న జరగనున్న ఎన్నికలకు సంబంధించిన నామినేషన్ల స్వీకరణ ఘట్టం ఆదివారం సాయంత్రం 3 గంటలకు ప్రశాంతంగా ముగిసింది. కూటమికి చెందిన తెలుగుదేశం, జనసేన, బీజేపీ పార్టీలతో పాటు వైఎస్సార్‌సీపీ, కాంగ్రెస్, సీపీఎం పార్టీల తరఫున అభ్యర్థులు పెద్ద ఎత్తున నామినేషన్లు దాఖలు చేశారు. నామినేషన్ల దాఖలుకు చివరి రోజు కావడంతో నాయకులు, కార్యకర్తలు, మద్దతుదారుల కోలాహలంతో నామినేషన్ కేంద్రాల వద్ద పండుగ వాతావరణం నెలకొంది.
హోరాహోరీగా మేయర్ పదవి పోటీ:
మేయర్ స్థానానికి కూటమి తరఫున షేక్ అబ్దుల్ అబీదా, వైఎస్సార్‌సీపీ తరఫున లంకా జ్యోతి తమ నామినేషన్లను ఎన్నికల అధికారికి సమర్పించారు. కూటమి అభ్యర్థి షేక్ అబ్దుల్ అబీదా నామినేషన్ దాఖలు కార్యక్రమానికి రాష్ట్ర మంత్రి కొల్లు రవీంద్ర, ఆమె భర్త హసీం బేగ్, నాయకులు కొనకళ్ల బుల్లయ్య, బండి రామకృష్ణ, కుంచే నాని, గొర్రెపాటి గోపీచంద్, మాదివాడ రాము, టీడీపీ కృష్ణాజిల్లా ప్రధాన కార్యదర్శి గోపు సత్యనారాయణ తదితరులు హాజరై మద్దతు తెలిపారు. నామినేషన్ల దాఖలు అనంతరం ఆమె నేరుగా ప్రచారంలో పాల్గొన్నారు.
మరొకవైపు వైఎస్సార్‌సీపీ మేయర్ అభ్యర్థి లంకా జ్యోతి నామినేషన్ కార్యక్రమంలో మాజీ మంత్రి, వైఎస్సార్‌సీపీ కృష్ణా జిల్లా అధ్యక్షుడు పేర్ని నాని, మాజీ మునిసిపల్ చైర్మన్ షేక్ సలార్ దాదా, పేర్ని కిట్టు తదితర ముఖ్య నాయకులు మరియు పెద్ద సంఖ్యలో పార్టీ శ్రేణులు పాల్గొన్నారు. నగరంలోని 60 డివిజన్లలో కార్పొరేటర్ పదవుల కోసం కూడా అభ్యర్థులు భారీ ఊరేగింపులతో వచ్చి తమ నామినేషన్ పత్రాలను దాఖలు చేశారు.

