మహిళలకు స్వయం ఉపాధి కల్పించి అండగా నిలుస్తాం: మంత్రి కొల్లు రవీంద్ర
* మచిలీపట్నంలో సీవీడ్ (సముద్రపు నాచు) తయారీ శిక్షణా కేంద్రాన్ని పరిశీలించిన రాష్ట్ర మంత్రి
* ప్రపంచ మార్కెట్లో సీవీడ్‌కు అద్భుతమైన డిమాండ్: భవిష్యత్ ఆదాయ వనరుగా గుర్తింపు
మచిలీపట్నం:
మహిళలు స్వయం ఉపాధి రంగంలో తమదైన గుర్తింపు తెచ్చుకునేందుకు ప్రభుత్వ పరంగా పూర్తి అండగా నిలుస్తామని రాష్ట్ర గనులు, భూగర్భ వనరులు, ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర పేర్కొన్నారు. ఈ మేరకు మచిలీపట్నంలో డీఆర్డీఏ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సీవీడ్ తయారీ శిక్షణా కేంద్రాన్ని ఆయన అధికారులతో కలిసి పరిశీలించారు.
సీవీడ్ సాగు – మార్కెట్ అవకాశాలు
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. సెర్ఫ్, డిపార్ట్మెంట్ ఆఫ్ ఫిషరీస్ ఆధ్వర్యంలో ఇలాంటి కార్యక్రమం నిర్వహించడం అభినందనీయమని తెలిపారు. గత సంవత్సరం నుండి బాపట్లలో సీవీడ్ ఫార్మింగ్ ట్రైనింగ్స్ ఇచ్చారని, ఇప్పుడు మచిలీపట్నంలో కూడా ఏర్పాటు చేయాలనుకోవడం సంతోషకరమన్నారు.
* పచ్చి సీవీడ్ రూ.30 వరకు, 10 శాతం కంటే తక్కువ మాయిశ్చచర్ ఉండే ఎండు సీవీడ్ రూ.160 వరకు అమ్ముకునే అవకాశం ఉంటుందని తెలిపారు.
* దీనిని ఫార్ములేషన్ చేసుకుంటే మార్కెట్లో రూ.750 నుంచి రూ.2,500 వరకు విలువ లభిస్తుందని, ప్రతి ఉత్పత్తిలోనూ వ్యాల్యూ యాడెడ్ పరిశ్రమలు రావాలని ఆకాంక్షించారు.
మహిళలకు పెద్దపీట – ప్రత్యేక యూనిట్ల ఏర్పాటుకు హామీ
ప్రపంచ మార్కెట్లో సీవీడ్‌కు విపరీతమైన డిమాండ్ ఉందని, శాస్త్రవేత్తలు సైతం దీనిని భవిష్యత్ ఆదాయ వనరుగా గుర్తించారని మంత్రి పేర్కొన్నారు. ప్రాథమికంగా ఒక యూనిట్ ఏర్పాటు చేసుకున్న తర్వాత బ్యాంకుల సహకారంతో పెద్ద యూనిట్లు ఏర్పాటు చేసుకోవచ్చని తెలిపారు.
* ఇందుకోసం సముద్ర తీరంలో అవసరమైన భూమిని ప్రభుత్వం నుండి ఇప్పించేందుకు తాను ఒప్పిస్తానని హామీ ఇచ్చారు.
* డ్వాక్రా సంఘాల ద్వారా మహిళలకు వస్తున్న రుణాలను సద్వినియోగం చేసుకుని ప్రతి ఒక్కరూ స్వయం ఉపాధి కేంద్రాలు ఏర్పాటు చేసుకోవాలని పిలుపునిచ్చారు.
రాష్ట్రంలోనే మొట్టమొదటి సీవీడ్ తయారీ కేంద్రం
రాష్ట్రంలోనే మొట్టమొదటి సీవీడ్ తయారీ కేంద్రాన్ని మచిలీపట్నంలో ఏర్పాటు చేసేలా ముఖ్యమంత్రితో మాట్లాడి ఒప్పిస్తానని మంత్రి కొల్లు రవీంద్ర హామీ ఇచ్చారు. డ్వాక్రా సంఘాలు తయారు చేసే ఉత్పత్తులకు ప్రపంచ వ్యాప్తంగా మార్కెటింగ్ కల్పించేందుకు ప్రభుత్వం సహకరిస్తుందని చెప్పారు. తయారీ, ప్యాకింగ్, మార్కెటింగ్ అంశాలపై డీఆర్డీఏ ద్వారా అన్ని విధాలా సహకారం అందిస్తామని, అవసరమైతే స్థానిక మహిళల కోసం ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేసి పరిశీలించేలా చర్యలు తీసుకుంటానన్నారు.
మహిళలు తలచుకుంటే సాధించలేనిది ఏదీ లేదని మంత్రి కొనియాడారు. మన ప్రాంతంలో ఫిషింగ్ ఎక్కువగా జరుగుతున్నప్పటికీ, ఎండు చేపలు మరియు ఉప్పు చేపలకు ప్రపంచవ్యాప్తంగా ఉన్న డిమాండ్‌ను దృష్టిలో పెట్టుకుని సరైన ప్యాకింగ్‌తో పంపిస్తే మంచి రేటు వస్తుందన్నారు. సీవీడ్ విషయంలో రీసెర్చ్, మార్కెటింగ్‌తో సహా అన్ని రకాల సహాయ సహకారాలు అందించే బాధ్యత తాను తీసుకుంటానని మంత్రి కొల్లు రవీంద్ర భరోసా కల్పించారు.

