కృష్ణా విశ్వవిద్యాలయంలో ఘనంగా బ్రహ్మర్షి రఘుపతి వెంకటరత్నం నాయుడు స్మారకోపన్యాసం
మచిలీపట్నం:
కృష్ణా విశ్వవిద్యాలయంలో “2వ బ్రహ్మర్షి రఘుపతి వెంకటరత్నం నాయుడు ఎండోమెంట్ ఉపన్యాస కార్యక్రమం” బుధవారం ఘనంగా నిర్వహించబడింది. ఈ కార్యక్రమానికి విశ్వవిద్యాలయ వైస్ ఛాన్సలర్ ఆచార్య కె. రాంజీ అధ్యక్షత వహించారు.
ఈ సందర్భంగా వైస్ ఛాన్సలర్ ఆచార్య కె. రాంజీ మాట్లాడుతూ… పూర్వ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ వెంకయ్య హయాంలో (2013-14) బ్రహ్మర్షి రఘుపతి వెంకటరత్నం నాయుడు కుటుంబ సభ్యులు అందించిన రూ. 3 లక్షల విరాళంతో ఈ ఎండోమెంట్ లెక్చర్ ప్రారంభమైనట్లు గుర్తుచేశారు. విశ్వవిద్యాలయంలో ఇటువంటి స్మారక ఉపన్యాసాలు ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు.
ఈ కార్యక్రమానికి ప్రధాన వక్తగా న్యూఢిల్లీకి చెందిన “నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎడ్యుకేషనల్ ప్లానింగ్ అండ్ అడ్మినిస్ట్రేషన్” (NIEPA) ప్రతినిధి డాక్టర్ కె. శ్రీనివాస్ హాజరై ప్రసంగించారు. NIEPA సంస్థ దేశవ్యాప్తంగా ఐఏఎస్ అధికారుల నుంచి దిగువ స్థాయి ఉద్యోగుల వరకు అధ్యాపక అభివృద్ధి కార్యక్రమాలు (FDP), పరిశోధనా కార్యక్రమాలను నిర్వహిస్తుందని ఆయన పేర్కొన్నారు. సాంకేతికత మరియు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ శ్రేష్ఠత పెరుగుతున్న ఈ రోజుల్లో, దేశంలోని ఆయా రంగాల అత్యున్నత నిపుణుల అనుభవాన్ని, పరిశోధనా పరిజ్ఞానాన్ని విద్యార్థులకు నేరుగా అందించడానికి ఇటువంటి ఎండోమెంట్ ఉపన్యాసాలు ఎంతో దోహదపడతాయని ఆయన వివరించారు.
ఈ కార్యక్రమంలో కృష్ణా విశ్వవిద్యాలయ రిజిస్ట్రార్ ఆచార్య ఎన్. ఉష, వివిధ విభాగాల అధ్యాపకులు, అనుబంధ కళాశాలల ప్రిన్సిపాళ్లు, కరస్పాండెంట్లు, అలాగే యూజీ, పీజీ, పీహెచ్డీ పరిశోధక విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

