రక్షణ చట్టం అమలు, జూనియర్లకు రూ. 10 వేల స్టైఫండ్ కు మచిలీపట్నంలో న్యాయవాదుల దీక్షలు: అక్టోబర్ 9 వరకు విధులు బహిష్కరణ
మచిలీపట్నం:
ఎంతోకాలంగా పెండింగ్‌లో ఉన్న ‘అడ్వకేట్స్ ప్రొటెక్షన్ యాక్ట్’ (న్యాయవాదుల రక్షణ చట్టం)ను తక్షణమే అమల్లోకి తీసుకురావడమే ప్రధాన డిమాండ్‌గా మచిలీపట్నం న్యాయవాదుల సంఘం ఆధ్వర్యంలో మంగళవారం జిల్లా కోర్టు ఎదుట రిలే నిరాహార దీక్షలు ప్రారంభమయ్యాయి. దీనితో పాటు జూనియర్ న్యాయవాదులకు హామీ ఇచ్చిన రూ. 10,000 స్టైఫండ్‌ను కూడా వెంటనే చెల్లించాలని న్యాయవాదులు కోరారు. కూటమి ప్రభుత్వం స్పందించే వరకు అక్టోబర్ 9 వరకు విధులు బహిష్కరిస్తూ ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తున్నట్లు ప్రకటించారు.
దీక్షా శిబిరంలో పలువురు న్యాయవాదులు మాట్లాడుతూ.. రాష్ట్రంలో న్యాయవాదులకు ప్రాణరక్షణ కరువైందని, తక్షణమే అసెంబ్లీలో ‘అడ్వకేట్స్ ప్రొటెక్షన్ యాక్ట్’కు ఆమోదం తెలపాలని సీఎం నారా చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌లను కోరారు. అలాగే జూనియర్ న్యాయవాదుల ఆర్థిక భద్రత కోసం ప్రకటించిన రూ. 10,000 స్టైఫండ్‌ను ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలని నాయకులు స్పష్టం చేశారు.
ఈ నిరసనలకు బంటుమిల్లి, కైకలూరు, గుడివాడ బార్ అసోసియేషన్లు కూడా మద్దతు తెలపి విధుల బహిష్కరణ, నిరాహార దీక్షలు చేపట్టాయి. ఈ కార్యక్రమంలో బార్ అసోసియేషన్ అధ్యక్షుడు తుంగల హరిబాబు, కార్యదర్శి సర్వా లలిత కుమారి, సీనియర్ అడ్వకేట్లు జి.వి.ఎల్. నరసింహారావు, కొండపల్లి వేణు, పి. సూర్యప్రకాష్, తోట శంకర్, పి. వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.

