మచిలీపట్నంలో హెచ్.ఐ.వి/ఎయిడ్స్‌పై అవగాహన: 5కే రన్, క్విజ్ పోటీలు ఘనంగా నిర్వహణ
మచిలీపట్నం:
స్థానిక లేడీ అంప్తిల్ కాలేజీలో విద్యార్థులకు హెచ్.ఐ.వి/ఎయిడ్స్‌పై అవగాహన కల్పించేందుకు 5కే మేరాథాన్ రన్ మరియు క్విజ్ పోటీలను ఘనంగా నిర్వహించారు. ఈ పోటీలలో కృష్ణా జిల్లాలోని వివిధ ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలల విద్యార్థినీ విద్యార్థులు విశేషంగా పాల్గొన్నారు. క్విజ్ పోటీలకు ముందు చిలకలపూడి సెంటర్ నుండి నోబుల్ కాలేజ్ వరకు 5కే పరుగు పందెం జరిగింది. కృష్ణా జిల్లా లెప్రసీ, ఎయిడ్స్ & టీబీ అధికారి డాక్టర్ అంబటి వెంకట్రావు జండా ఊపి ఈ పరుగును ప్రారంభించగా, పోటీల్లో విజేతలకు ఆయన చేతుల మీదుగానే బహుమతులు, ప్రశంసా పత్రాలు అందజేశారు.
ఈ సందర్భంగా జిల్లా ఎయిడ్స్ అధికారి డాక్టర్ అంబటి వెంకట్రావు మాట్లాడుతూ ప్రతి ఒక్క విద్యార్థి హెచ్.ఐ.వి/ఎయిడ్స్‌పై స్పష్టమైన అవగాహన పెంచుకుని ఇతరుల్లో కూడా చైతన్యం తీసుకురావాలని కోరారు. క్లస్టర్ ప్రోగ్రామ్ మేనేజర్ పి. కిరణ్ మాట్లాడూ ఎయిడ్స్ బాధితుల పట్ల ఎలాంటి వివక్షత చూపరాదని, ‘హెచ్.ఐ.వి ఆక్ట్ 2017’ సేవలను వినియోగించుకోవాలని తెలిపారు. కళాశాల ప్రిన్సిపాల్ పి.ఎస్.జి.ఎన్. లక్ష్మి హైస్కూల్ స్థాయి నుంచే విద్యార్థులు ఈ వ్యాధిపై అవగాహన కలిగి ఉండాలని సూచించగా, క్లస్టర్ ప్రివెన్షన్ ఆఫీసర్ కాళంగి రవికుమార్ సందేహాల నివృత్తికి 1097 టోల్ ఫ్రీ నంబర్‌ను సంప్రదించాలని కోరారు. జూనియర్ లెక్చరర్ ఎల్.కే. హరినాథ్ బాబు తల్లిదండ్రులు కూడా ఈ విషయంలో అప్రమత్తంగా ఉండాలన్నారు.
ఈ కార్యక్రమంలో లీడ్స్ ప్రాజెక్ట్ కోఆర్డినేటర్ ఎం. అరుణ, గైడ్ ప్రోగ్రామ్ మేనేజర్ శశికళ, యువజన సంక్షేమ సంఘం ప్రశాంతి, అంకిత ప్రోగ్రామ్ మేనేజర్ అరుణ్ కుమార్, దుర్గా తదితరులు పాల్గొన్నారు.

