రూ.25 లక్షలు పలికిన బందరు సాగర తీర మహా గణపతి లడ్డూ
మచిలీపట్నం:
మచిలీపట్నం సాగర తీరంలో వేడుకగా కొలువైన 63 అడుగుల మహా గణపతి లడ్డూ వేలం పాట రికార్డు సృష్టించింది. గురువారం నిర్వహించిన ఆన్లైన్, ఆఫ్‌లైన్ వేలం పాటలో స్వామి వారి 630 కేజీల మహా లడ్డూ ప్రసాదం ఏకంగా రూ. 25 లక్షల భారీ ధర పలికింది.
జూమ్ లో పోటీపడిన భక్తులు
ఈ లడ్డూ వేలం పాటలో దేశ విదేశాల నుంచి ఆన్లైన్ (Zoom) ద్వారా, స్థానికంగా ఆఫ్‌లైన్ ద్వారా మొత్తం 600 మంది భక్తులు ఉత్సాహంగా పాల్గొన్నారు. తీవ్ర పోటీ మధ్య బందరు ఆక్వా ఎక్స్పోర్ట్ అధినేత, FCS ట్రేడింగ్ ప్రైవేట్ లిమిటెడ్ యజమాని భవానీ శంకర్ ఈ లడ్డూను రూ. 25 లక్షలకు దక్కించుకున్నారు. లడ్డూను కైవశం చేసుకున్న భవానీ శంకర్‌ను గణేష్ ఉత్సవ కమిటీ సభ్యులు ప్రత్యేకంగా అభినందించారు. ఉత్సవ కమిటీ ప్రతినిధులు ఆయనకు స్వామి వారి ప్రసాదాన్ని అందించారు.

రేపే స్వామి వారి కళ్యాణం, నిమజ్జనం
శుక్రవారం జరగనున్న శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వారి దివ్య కళ్యాణ మహోత్సవంలో ప్రధాన యజమానులుగా భవానీ శంకర్ దంపతులు పాల్గొననున్నారు. కళ్యాణ మహోత్సవం పూర్తయిన వెంటనే, 63 అడుగుల అత్యంత భారీ మహా గణపతి విగ్రహాన్ని ఫైర్ జెట్ (Fire Jet) సాంకేతికత ద్వారా ఘనంగా నిమజ్జనం చేయనున్నట్లు ఉత్సవ కమిటీ ప్రతినిధులు తెలిపారు. నిమజ్జన కార్యక్రమం అనంతరం భక్తులందరికీ భారీ స్థాయిలో అన్నదాన కార్యక్రమం నిర్వహించనున్నారు.

