MachilipatnamLocal News
September 20, 2026
మచిలీపట్నం

గో సంఘంలో వేమూరి ట్రస్ట్ సేవలు అభినందనీయం: లంకిశెట్టి బాలాజీ

  • September 19, 2026
  • 0 min read
గో సంఘంలో వేమూరి ట్రస్ట్ సేవలు అభినందనీయం: లంకిశెట్టి బాలాజీ

 * రూ. 10 వేల విలువైన దాణా, కూరగాయలు, పండ్లు పంపిణీ

మచిలీపట్నం:

మచిలీపట్నం చింతకుంటపాలెంలోని గో సంరక్షణ కేంద్రంలో శనివారం వేమూరి సేవా ట్రస్ట్ ఆధ్వర్యంలో పదివేల రూపాయల విలువైన వివిధ రకాల కూరగాయలు, ఆకుకూరలు, పండ్లు మరియు దాణాను గోవులకు మేతగా అందజేశారు. ట్రస్ట్ చైర్మన్ వేమూరి రమేష్ మాట్లాడుతూ.. పేద విద్యార్థులకు అందిస్తున్న సేవా కార్యక్రమాలతో పాటు, ముక్కోటి దేవతల స్వరూపమైన గోవుల సంరక్షణకు తమ వంతు సహాయం అందిస్తున్నామని తెలిపారు.

ఈ సందర్భంగా మచిలీపట్నం బార్ అసోసియేషన్ మాజీ అధ్యక్షులు లంకిశెట్టి బాలాజీ మాట్లాడుతూ.. సుమారు 200 ఆవులను పోషిస్తున్న పురాతన గో సంరక్షణ కేంద్రంలో వేమూరి ట్రస్ట్ చేసిన సేవలు అభినందనీయమని కొనియాడారు. అయితే, ఇటీవల ఈ ప్రాంగణంలో గంజాయి, తాగుబోతుల మూకల సంచారం పెరగడంతో మహిళలు, గోప్రేమికులు రాకపోకలు సాగించడానికి భయపడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రాంగణంలో ఆకతాయిలు, అసాంఘిక శక్తులను నివారించేందుకు తక్షణ చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్, జిల్లా ఎస్పీలకు ఆయన విజ్ఞప్తి చేశారు.

గో సంఘం ప్రధాన కార్యదర్శి పల్లపోతు సుబ్రహ్మణ్యేశ్వర రావు మాట్లాడుతూ, తటవర్తి వంశీకులు కేటాయించిన 59 ఎకరాల్లో చైర్మన్ గుడివాడ వెంకటగున్నయ్య శెట్టి ఆధ్వర్యంలో కేంద్రం నిర్వహణ సజావుగా సాగుతోందని, పట్టణ ప్రజలంతా గో సంఘ అభివృద్ధికి సహకరించాలని కోరారు. వెలుగు ఫౌండేషన్ చైర్మన్ చందమామ బాబు మాట్లాడుతూ.. మూగజీవాలకు ఆహారం అందించడం మాధవ సేవతో సమానమని, వేమూరి ట్రస్ట్ సేవలు ఇతరులకు ఆదర్శప్రాయమని అన్నారు.

ఈ కార్యక్రమంలో గో సంఘం ఉపాధ్యక్షులు గుడివాడ ప్రసాద్, గోపాల కార్యదర్శి ఓలేటి చంద్రశేఖర్, మాగంటి రమణ, వేమూరి రత్నగిరి, న్యాయవాది మాటూరి రాజేష్, అన్నం బాబురావు, సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ లంకిశెట్టి దీపక్, పెన్నేరు దేవాన్ష్ తదితరులు పాల్గొన్నారు.

About Author

SSN