కృష్ణా యూనివర్సిటీలో ఘనంగా ‘ఇంజనీర్స్ డే’ వేడుకలు
మచిలీపట్నం:
ప్రఖ్యాత భారతీయ ఇంజనీర్, భారతరత్న సర్ మోక్షగుండం విశ్వేశ్వరయ్య జయంతిని పురస్కరించుకుని కృష్ణా విశ్వవిద్యాలయంలో ‘ఇంజనీర్స్ డే’ వేడుకలను మంగళవారం ఘనంగా నిర్వహించారు. సెప్టెంబర్ 15న దేశవ్యాప్తంగా ఇంజనీర్స్ డే జరుపుకునే ఆనవాయితీలో భాగంగా కృష్ణా యూనివర్సిటీ ఇంజనీరింగ్ కళాశాలలో ప్రిన్సిపల్ ఆచార్య వై.కే. సుందర కృష్ణ అధ్యక్షతన ఈ కార్యక్రమం జరిగింది.
ఈ వేడుకలకు వర్సిటీ ఉపకులపతి (విసి) ఆచార్య కే. రాంజీ ముఖ్యఅతిథిగా విచ్చేసి మాట్లాడారు. విశ్వేశ్వరయ్యకు విద్య, ఇంజనీరింగ్ తో పాటు అనేక రంగాలలో విశేషమైన గుర్తింపు లభించిందని కొనియాడారు. కర్ణాటకలోని అత్యధిక ఇంజనీరింగ్ కళాశాలలు అనుబంధమై ఉన్న బెల్గాంలోని ‘విశ్వేశ్వరయ్య టెక్నలాజికల్ యూనివర్సిటీ’ ఆయన పేరు మీదే నెలకొల్పబడటం ఆయన ప్రతిభకు నిదర్శనమని పేర్కొన్నారు. అనంతరం వర్సిటీ రిజిస్ట్రార్ ఆచార్య ఎన్. ఉష మాట్లాడుతూ, దేశానికే తలమానికమైన వ్యవసాయ, సాగునీటి రంగాల అభివృద్ధికి విశ్వేశ్వరయ్య అందించిన విశిష్ట సేవలను స్మరించుకున్నారు.
ఈ కార్యక్రమంలో సిడిసి డీన్ ఆచార్య ఆర్. కిరణ్ కుమార్, కంప్యూటర్ సైన్స్ విభాగాధిపతి డాక్టర్ ఎం. బాబు రెడ్డి, డాక్టర్ ఆర్. విజయకుమారిలతో పాటు ఇంజనీరింగ్ కళాశాల బోధనా సిబ్బంది, విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

