పామర్రు :
తోట్లవల్లూరు మండలం దేవరపల్లి గ్రామంలో పిఎసిఎస్ (ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం) భవన నిర్మాణానికి శంకుస్థాపన కార్యక్రమం ఘనంగా నిర్వహించబడింది.
ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా మాజీ మంత్రి, కృష్ణాజిల్లా సహకార కేంద్ర బ్యాంకు ( కేడిసిసి ) చైర్మన్
నెట్టెం రఘురామ్, పామర్రు ఎమ్మెల్యే వర్ల కుమార్ రాజా, కృష్ణాజిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు వీరంకి వెంకట గురుమూర్తి ముఖ్యఅతిథిగా హాజరై శంకుస్థాపన చేశారు.
ఈ సందర్భంగా నెట్టెం రఘురామ్ మాట్లాడుతూ, సహకార రంగం బలోపేతం ద్వారానే రైతుల ఆర్థికాభివృద్ధి సాధ్యమని స్పష్టం చేశారు. పిఎసిఎస్ ద్వారా రైతులకు సకాలంలో తక్కువ వడ్డీ రుణాలు, నాణ్యమైన విత్తనాలు, ఎరువులు మరియు అవసరమైన వ్యవసాయ సదుపాయాలు అందించేందుకు కృషి చేస్తామని తెలిపారు. దేవరపల్లి గ్రామంలో నిర్మాణం ప్రారంభమైన ఈ పిఎసిఎస్ భవనం రాబోయే కాలంలో రైతులకు నమ్మకమైన సేవా కేంద్రంగా రూపుదిద్దుకుని, వారి ఆర్థిక స్థితిని మరింత బలోపేతం చేస్తుందని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు.
పామర్రు ఎమ్మెల్యే వర్ల కుమార్ రాజా మాట్లాడుతూ, గ్రామీణాభివృద్ధికి సహకార సంస్థలు కీలక పాత్ర పోషిస్తున్నాయని, రైతులకు అందుతున్న సేవలను మరింత విస్తరించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు. పిఎసిఎస్ నిర్మాణం గ్రామానికి అభివృద్ధి దిశగా ఒక ముఖ్యమైన అడుగుగా నిలుస్తుందని పేర్కొన్నారు.
కృష్ణాజిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు వీరంకి వెంకట గురుమూర్తి మాట్లాడుతూ, సహకార వ్యవస్థ బలోపేతం అయితేనే రైతు కుటుంబాలు ఆర్థికంగా ఎదుగుతాయని అన్నారు. నెట్టేం రఘురామ్ నాయకత్వంలో సహకార బ్యాంకింగ్ వ్యవస్థ మరింత ప్రజలకు చేరువవుతోందని, రైతులకు అవసరమైన సేవలు సులభంగా అందుతున్నాయని ఆయన అభినందించారు. ఈ పిఎసిఎస్ ద్వారా గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు కొత్త ఊపు వస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.
ఈ కార్యక్రమంలో దేవరపల్లి పిఎసిఎస్ ప్రెసిడెంట్ బొమ్ము శివ నాగిరెడ్డి, గ్రామ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు కొల్లి శ్రీనివాస్ రెడ్డి, తెలుగుదేశం పార్టీ నాయకులు ఆరేపల్లి జయరాజు, దేవరపల్లి రామారావు తదితరులు పాల్గొన్నారు