[addtoany]
మచిలీపట్నం :
కృష్ణాజిల్లాలో ఇంధన కొరత, మచిలీపట్నం పోర్టు నిర్మాణం వంటి కీలక అంశాలపై వైసీపీ రీజనల్ కోఆర్డినేటర్ వై వి సుబ్బారెడ్డి తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. మచిలీపట్నంలో సత్యా కన్వెన్షన్ హాల్ లో ఏర్పాటు చేసిన సంకల్ప సాధన సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో డీజిల్–పెట్రోల్ కొరతపై ప్రభుత్వ వైఖరిని తప్పుబట్టారు. దేశంలో ఎక్కడా లేని విధంగా ఆంధ్రప్రదేశ్‌లోనే ఇంధన కొరత తీవ్రంగా ఉందని ఆయన విమర్శించారు. కేంద్ర ప్రభుత్వంతో చర్చించి వెంటనే సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. డీజిల్ కొరతతో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, ముఖ్యంగా ఆక్వా రైతుల పరిస్థితి దయనీయంగా మారిందన్నారు. రాష్ట్రవ్యాప్తంగా పెట్రోల్ బంకుల వద్ద వైసీపీ ఆధ్వర్యంలో నిరసనలు చేపట్టనున్నట్లు ఆయన తెలిపారు. ప్రజల సమస్యలపై ప్రభుత్వం స్పందించేలా ఒత్తిడి తీసుకురావడమే లక్ష్యమని చెప్పారు. పోర్టులు, ఫిషింగ్ హార్బర్ల నిర్మాణంపై మాట్లాడుతూ, రాష్ట్రంలో నాలుగు పోర్టుల పనులు సుమారు 40 శాతం పూర్తయ్యాయని, ఆరు ఫిషింగ్ హార్బర్ల నిర్మాణం కూడా చివరి దశలో ఉందన్నారు. అయితే ప్రస్తుత ప్రభుత్వం ఈ పనులను నిలిపివేసిందని ఆరోపించారు.
ఎన్నికల ముందు వరకు బందరు పోర్టు నిర్మాణం వేగంగా సాగిందని, కానీ ప్రభుత్వం మారిన తర్వాత పనులు పూర్తిగా నిలిచిపోయాయని విమర్శించారు. సుమారు 7–8 వేల కోట్ల రూపాయలు ఖర్చు చేస్తే పోర్టులు, హార్బర్ల పనులు పూర్తవుతాయని పేర్కొన్నారు. మే 5 నుంచి 10 తేదీల మధ్య మచిలీపట్నం పోర్టును సందర్శించనున్నట్లు తెలిపారు. దీనికి సంబంధించిన అనుమతుల కోసం ఇప్పటికే అధికారులను సంప్రదించామని, అనుమతులు వచ్చిన వెంటనే ఖచ్చితమైన తేదీ ప్రకటిస్తామని చెప్పారు. అమరావతి అభివృద్ధికి లక్షల కోట్లు ఖర్చు చేస్తున్న ప్రభుత్వం, పోర్టులు–హార్బర్ల పూర్తి కోసం కేవలం పది వేల కోట్లు కూడా వెచ్చించలేకపోతుందా అని ప్రశ్నించారు. రాజకీయ కారణాల వల్లే ఈ ప్రాజెక్టులు నిలిచిపోయాయని ఆరోపించారు. రాష్ట్రంలో ఉన్న అన్ని పోర్టులు, ఫిషింగ్ హార్బర్లను త్వరితగతిన పూర్తి చేయించేలా ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకువస్తామని, అవసరమైతే రాష్ట్రవ్యాప్తంగా పోరాటం కొనసాగిస్తామని వైవీ సుబ్బారెడ్డి స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి, కృష్ణాజిల్లా వైఎస్ఆర్సిపి పార్టీ అధ్యక్షులు పేర్ని వెంకట్రామయ్య (నాని), మచిలీపట్నం నియోజకవర్గ ఇంచార్జ్ పేర్ని కిట్టు, మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్, పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, దేవినేని అవినాష్, మాజీ మంత్రులు మాజీ శాసనసభ్యులు తదితరులు పాల్గొన్నారు.

