[addtoany]
మచిలీపట్నం :
అత్యంత అధునాతనమైన పరిజ్ఞానంతో లోవోల్టేజ్ సమస్య అధిగమించి వినియోగదారులకు నాణ్యమైన విద్యుత్తును సరఫరా చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం అనేక చర్యలు చేపడుతుందని రాష్ట్ర గనులు భూగర్భవనరులు ఎక్సైజ్ శాఖ మంత్రివర్యులు కొల్లు రవీంద్ర పేర్కొన్నారు.
ఆదివారం ఉదయం నగరంలోని 14 వ డివిజన్ బచ్చుపేట ప్రాంతంలో 6.30 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించనున్న 33/11 కేవీ సెమీ ఇండోర్ విద్యుత్ ఉప కేంద్రానికి మంత్రివర్యులు, ఆర్టీసీ చైర్మన్ కొనకళ్ళ నారాయణరావు డీసీఎంఎస్ చైర్మన్ బండి రామకృష్ణలతో కలిసి శంకుస్థాపన చేశారు.
ఈ సందర్భంగా మంత్రివర్యులు మాట్లాడుతూ
ఈ విద్యుత్ ఉప కేంద్రం మొత్తం కూడా అత్యంత అధునాతనమైనటువంటి పరిజ్ఞానంతో ఇండోర్ విద్యుత్ కేంద్రంగా ఏర్పాటు చేయడం జరుగుతుందని, కేబుళ్లు ఎక్కడా కూడ బయటకు కనబడకుండా భూమి లోపల ఉంటాయన్నారు.. దీనివల్ల మన బుట్టాయపేట, రామానాయుడుపేట, ఇంగ్లీష్ పాలెం, భాస్కర పురం, చిలకలపూడి వరకు కూడా ఈ సబ్ స్టేషన్ నుంచి మరి కేబుళ్లు అన్నీ కూడా విద్యుత్ సరఫరా అవుతాయన్నారు. దీనివల్ల మిగతా సబ్ స్టేషన్ ల మీద లోడ్ తగ్గుతుందనీ. లో వోల్టేజ్ సమస్య అనేది రాదన్నారు. ఈ కేబుళ్లు అన్ని పనిచేయకపోవడం అనేది జరగదన్నారు. అందుకనే ఈ సబ్ స్టేషన్ ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగిందన్నారు.
ముఖ్యంగా మన మచిలీపట్నం నగరంలో మొత్తం 74000 కనెక్షన్స్, గ్రామీణ ప్రాంతంలో 30 వేల విద్యుత్ కనెక్షన్స్ ఉన్నాయన్నారు. దాదాపు 3500 ఆక్వా చెరువులకు విద్యుత్ కనెక్షన్లు ఉన్నాయన్నారు.. ఆక్వాకు కేవలం రూపాయిన్నరకే విద్యుత్ సరఫరా చేస్తున్నామన్నారు. ఎస్సీ సోదరులకి కూడా 200 యూనిట్ల లోపల ఉచితంగా విద్యుత్తు సరఫరా చేస్తున్నామన్నారు. అదేవిధంగా నాయీ బ్రాహ్మణ సోదరులకి 200 యూనిట్లు, చేనేత కార్మికులకు 200 యూనిట్లు ఉచితంగా విద్యుత్తు అందిస్తున్నామన్నారు.
ఇవాళ ఇవన్నీ కూడా ఇవ్వగలుగుతున్నామంటే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ , విద్యుత్ శాఖ మంత్రి రవికుమార్ విద్యుత్ మీద ప్రత్యేక దృష్టి పెట్టడమేనన్నారు.
పీఎం సూర్య ఘర్ పథకం కింద రెండు కే.వి.ల సోలార్ ప్యానల్స్ పెట్టుకుంటే 78000 రూపాయలు సబ్సిడీ ఇస్తున్నామన్నారు. అదే ఎస్సీ, ఎస్టీ సోదరులకైతే పూర్తిగా ఉచితమనీ అంటే లక్షా 20వేల రూపాయలు ప్రభుత్వమే భరిస్తోందన్నారు. అలాగే బీసీ సోదరులకు ఇంకో 20,000 రూపాయలు అదనంగా ఇస్తున్నామన్నారు .
సూర్య కుసుం కింద రైతులు కూడా సబ్సిడీతో పెట్టుకోవచ్చన్నారు. పంపు వాడుకున్నప్పుడు పంపు వాడుకుంటాం లేదంటే అది గ్రిడ్ కి ఇస్తే ఇంకా డబ్బులు మనకే వస్తాయన్నారు. ప్రజలు రైతులు అందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు
ఈరోజు ఒక మంచి ఆలోచనతో ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి కార్యక్రమాలకి అందరూ కూడా సహకరించాలన్నారు.
ఇవాళ మొత్తం 132 కెవి ఉపకేంద్రం డంపింగ్ యార్డ్ దగ్గర ఉందని, 132 కేవీ అంటే మెయిన్ ఫీడర్ అక్కడి నుంచి మనకు విద్యుత్తు వస్తుందనీ, అక్కడి నుంచి ఉలింగిపాలెం, ఇనుగుదురు, పంపుల చెరువు బి1లో ఉంటుందని. అలాగే బి2 సెక్షన్ కింద మన ఎం పిడిఓ కార్యాలయం లో ఒకటి ఉంది, హౌసింగ్ బోర్డు ఒకటి సబ్ స్టేషన్ ఉందన్నారు. మళ్ళీ మూడు నెలల తర్వాత, జూలైలో వచ్చి ప్రారంభిస్తామన్నారు
ఆర్టీసీ చైర్మన్ కొనకళ్ళ నారాయణ రావు మాట్లాడుతూ
నాణ్యమైన విద్యుత్తు ఇవ్వాలి అంటే సబ్ స్టేషన్లు అవసరం ఉందన్నారు. ఇందుకోసం ఇప్పటికే. చాలా సబ్ స్టేషన్ నిర్మించడం జరిగిందన్నారు. ఇవాళ నగరం నడిబొడ్డున మరి సబ్ స్టేషన్ నిర్మించాలాంటే కనీసం ఒక ఎకరం రెండు ఎకరాల స్థలం కావాల్సి ఉంటుందన్నారు.
ప్రస్తుతం ఇండోర్ విద్యుత్ కేంద్రం అనే ఒక కొత్త మోడల్ లో. ఏర్పాటు చేస్తున్నామని, అందులో వైర్లన్నీ కూడా భూమి లోపల వస్తాయన్నారు. ఎక్కువ స్థలంలో కాకుండా తక్కువ స్థలంలోనే 33/11 కేవి సబ్స్టేషన్ అధునాతన పరిజ్ఞానంతో ఏర్పాటు చేసుకుంటున్నామన్నారు. వచ్చే వేసవి కాలానికి లోవల్టేజ్ సమస్య లేకుండా ఇబ్బందులన్నీ తీరుతాయన్నారు.
ఈ కార్యక్రమంలో విద్యుత్ శాఖ ఎస్ ఈ రవీంద్రబాబు, మునిసిపల్ సహాయ కమిషనర్ గోపాలరావు, డిసిఎంఎస్ అధ్యక్షులు బండి రామకృష్ణ, విద్యుత్ శాఖ ఈ ఈ గోవిందరావు, డి ఈ రామకృష్ణ, ఏ ఈ రమణ, రాష్ట్ర మైనారిటీ ఆర్థిక సంస్థ డైరెక్టర్ హసీం బేగ్, స్థానిక నాయకులు వెంకటస్వామి, మురళీకృష్ణ, రత్నాకర్, సుశీల మాదివాడ రాము, వెంకన్న తదితర అధికారులు, అనధికారులు పాల్గొన్నారు.

