విద్యార్థులు మొబైల్ ఫోన్ ను అధికంగా వినియోగించడం వల్ల వారి మానసిక ఆరోగ్యం దెబ్బతింటుందని తద్వారా విద్యకు దూరమవుతారని పిఎంశ్రీ కేంద్రీయ విద్యాలయ ప్రిన్సిపాల్ మహ్మద్ అసిఫ్ హుస్సేన్ పేర్కొన్నారు. స్థానిక పిఎంశ్రీ కేంద్రీయ విద్యాలయాలో ఒకటవ తరగతి విద్యార్థుల విద్యాప్రవేశ్ కార్యక్రమం శనివారం ఘనంగా నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నేటి సమాజంలో చిన్నారులకు తల్లిదండ్రులు చరవాణి(మొబైల్ ఫోన్)ను ఇచ్చి వారి పనులు వారు చూసుకోవడం వల్ల పిల్లల్లో చరవాణి ఫై మోజు రోజు రోజుకి పెరుగుతుందన్నారు. దీనివల్ల వారి కేంద్రీయ నాడీ వ్యవస్థలో సమస్యలు ఉత్పన్నమయ్యి ఆటిజం, ఏకాగ్రత లోపం లాంటి అనేక సమస్యలు ఎదురవుతున్నాయి అన్నారు. దీనివల్ల అభ్యసన వైకల్యాలు ఏర్పడుతున్నాయని ఆయన స్పష్టం చేశారు. అందుకే తల్లిదండ్రులు పిల్లల శారీరక, మానసిక ఆరోగ్యానికి వారితో అత్యధిక సమయం గడుపుతూ ప్రశాంత వాతావరణం లో ఆడి, పాడి ఆనందించేలా వేసవిలో జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ప్రణాళిక బద్ధమైన నియమ నిబంధనల వలన పిల్లల్లో విద్యా ప్రగతి మెరుగవుతుందన్నారు.
చిన్నారుల సాంస్కృతిక ప్రదర్శనలు అందరిని ఆకర్షించాయి. కార్యక్రమంలో ఉపాధ్యాయులు, విద్యార్థులు, తల్లిదండ్రులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.