విజయవాడలో మచిలీపట్నం నగర కాంగ్రెస్ అధ్యక్షుడు అబ్దుల్ మతీన్ అరెస్ట్
మచిలీపట్నం :
ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్ఎస్ఆర్) ప్రక్రియను రద్దు చేయాలని, కేంద్ర ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్ను పదవి నుంచి తొలగించాలని, రాబోయే ఎన్నికలను బ్యాలెట్ పత్రాల ద్వారానే నిర్వహించాలని డిమాండ్ చేస్తూ కాంగ్రెస్ పార్టీ పిలుపునిచ్చిన ‘చలో రాజ్భవన్’ కార్యక్రమంలో పాల్గొనేందుకు మచిలీపట్నం నుంచి కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు భారీ సంఖ్యలో విజయవాడకు తరలివెళ్లారు. పోలీసుల ఆంక్షలు, ముందస్తు అరెస్టులను దాటుకుని కాంగ్రెస్ శ్రేణులు విజయవాడ లెనిన్ సెంటర్ వద్దకు చేరుకుని నిరసన తెరిపాయి.
ఈ సందర్భంగా విజయవాడ లెనిన్ సెంటర్ వద్ద ఆందోళన నిర్వహిస్తున్న కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ) సభ్యులు గిడుగు రుద్రరాజు, ఏపీసీసీ కార్యదర్శి మరియు ఆంధ్రప్రదేశ్ వ్యవహారాల ఇన్ఛార్జి పి.వి. మోహన్, మచిలీపట్నం నగర కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు మరియు అసెంబ్లీ నియోజకవర్గ కాంగ్రెస్ కోఆర్డినేటర్ అబ్దుల్ మతీన్లను పోలీసులు అరెస్టు చేసి భవానీపురం పోలీస్ స్టేషన్కు తరలించారు. అనంతరం అరెస్టు అయిన వారిని సాయంత్రం సొంత పూచీకత్తుపై విడుదల చేశారు.
ఈ కార్యక్రమంలో ఏఐసీసీ సభ్యులు ధనేకుల మురళీమోహన్ రావు, పీసీసీ ప్రధాన కార్యదర్శి మొవ్వా మోహన్ రావు, పెనమలూరు కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసిన వెలిశెల సుబ్రహ్మణ్యం, జిల్లా యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు పుల్లంకి లోకేష్, నల్లబోలు కుమారి, నల్లబోలు శామ్యూల్, లిల్లీ వసంతనందిని, పొట్లూరి అమ్మాజీ, షేక్ చోటే బాజీ, మహమ్మద్ బాజీ, ఎం.డి. హమీద్, పుప్పాల సాయిబాబు, నాడా మాధవరావు, మొహమ్మద్ అబ్బాస్ తదితర ముఖ్య నాయకులు పాల్గొని అరెస్ట్ అయ్యారు. ప్రజాస్వామ్య పరిరక్షణ, ఎన్నికల పారదర్శకత మరియు ఓటు హక్కు కోసం తమ పోరాటం నిరంతరం కొనసాగుతుందని ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకులు స్పష్టం చేశారు.

