అంగవైకల్య బాధిత కుటుంబానికి ‘స్వేచ్ఛ ట్రస్ట్’ రూ.3,000 ఆర్థిక సాయం, నిత్యావసరాల పంపిణీ
మచిలీపట్నం:
ఆపదలో ఉన్నవారికి అండగా నిలుస్తూ స్వేచ్ఛ ఎడ్యుకేషన్ అండ్ చారిటబుల్ ట్రస్ట్ మరోసారి తన మానవత్వాన్ని చాటుకుంది. అంగవైకల్యంతో బాధపడుతున్న ఓ నిరుపేద బాలుడి కుటుంబానికి ట్రస్ట్ నిర్వాహకులు నిత్యావసర సరుకులతో పాటు ఆర్థిక సాయాన్ని అందజేశారు.
నాగాయలంక మండలం కమ్మలమోడు గ్రామానికి చెందిన 16 ఏళ్ల కొక్కిలిగడ్డ సాయి శ్యామ్ ప్రసాద్ చిన్ననాటి నుంచే అంగవైకల్యంతో మంచానికే పరిమితమయ్యాడు. తండ్రి లేకపోవడంతో ఆ కుటుంబం తీవ్ర ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటోంది. శ్యామ్ ప్రసాద్ పరిస్థితిని అతని తల్లి స్వేచ్ఛ ట్రస్ట్ నిర్వాహకుడు ఎం.డి. రఫి దృష్టికి తీసుకెళ్లగా ఆయన తక్షణమే స్పందించారు.
ప్రముఖ న్యాయవాది లంకిశెట్టి బాలాజీ సమక్షంలో మచిలీపట్నంలో ఆ కుటుంబానికి రెండు నెలలకు సరిపడా నిత్యావసర సరుకులు, కూరగాయలు మరియు రూ.3,000 నగదును అందజేశారు. ఈ సందర్భంగా లంకిశెట్టి బాలాజీ మాట్లాడుతూ, బాధితులకు చేయూతనందించడం ప్రతి ఒక్కరి సామాజిక బాధ్యత అని పేర్కొన్నారు. నిరుపేదలకు, ఆపదలో ఉన్నవారికి సేవలందించడమే తమ సంస్థ ధ్యేయమని, భవిష్యత్తులోనూ ఇటువంటి సేవా కార్యక్రమాలు కొనసాగిస్తామని స్వేచ్ఛ ట్రస్ట్ వ్యవస్థాపకుడు షేక్ రఫి తెలిపారు.
ఈ కార్యక్రమంలో లంకిశెట్టి వనజ, సాయి ఫణి సంతోష్, ఆశ నాగ మౌనిక, మాదిరెడ్డి బాబా, కే. సుజాత, ట్రాఫిక్ హెడ్ కానిస్టేబుల్ మల్లి, కనపర్తి ఆంథోనీ, రమేష్, బోయిన నాగరాజు, చీతిరాల మురళీమోహన్ తదితరులు పాల్గొన్నారు.

