MachilipatnamLocal News
October 17, 2026
మచిలీపట్నం

రూ. 6 కోట్లతో మచిలీపట్నంలో 22 ప్రాజెక్టులకు శ్రీకారం చుట్టిన మంత్రి కొల్లు రవీంద్ర

  • September 30, 2026
  • 1 min read
రూ. 6 కోట్లతో మచిలీపట్నంలో 22 ప్రాజెక్టులకు శ్రీకారం చుట్టిన మంత్రి కొల్లు రవీంద్ర

మచిలీపట్నం:

“బంగారు బందరు” నిర్మాణమే ధ్యేయంగా ప్రభుత్వం మచిలీపట్నం నగర సమగ్ర అభివృద్ధికి ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తోందని రాష్ట్ర గనులు, భూగర్భ వనరులు, ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర స్పష్టం చేశారు. బుధవారం మచిలీపట్నం లో సుమారు రూ.6 కోట్ల అంచనా వ్యయంతో చేపడుతున్న 22 అభివృద్ధి పనులకు ఏపీఎస్ఆర్టీసీ చైర్మన్ కొనకళ్ళ నారాయణరావుతో కలిసి మంత్రి శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు.

పర్యటనలో భాగంగా మంత్రి తొలుత 19వ డివిజన్‌లో మచిలీపట్నం రైల్వే స్టేషన్ సమీపంలో నూతనంగా ఆధునికరించిన ‘పైలాన్ పార్క్’ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, నగరాన్ని అన్ని రంగాల్లో తీర్చిదిద్ది ప్రజలకు మెరుగైన మౌలిక వసతులు, సౌకర్యాలు అందుబాటులోకి తీసుకురావడమే ప్రభుత్వ ముఖ్య ఉద్దేశమని పేర్కొన్నారు.

రూ.52 కోట్లతో మున్సిపాలిటీ అభివృద్ధి

ఇప్పటికే మున్సిపాలిటీ పరిధిలో రూ.52 కోట్ల హైబ్రిడ్ యాన్యుటీ మోడల్ (హెచ్ఏఎం) నిధులతో వివిధ మౌలిక సదుపాయాల పనులు కొనసాగుతున్నాయని మంత్రి తెలిపారు. పట్టణంలోని రహదారులు, డ్రైనేజీ వ్యవస్థ, తాగునీటి సరఫరా, శ్మశాన వాటికల రూపురేఖలు మార్చడంతో పాటు పార్కుల సుందరీకరణ పనులను దశలవారీగా చేపడుతున్నామని వివరించారు. నాణ్యతా ప్రమాణాలకు పెద్దపీట వేస్తూ, నిర్దేశిత గడువులోగా పనులన్నీ పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని అధికారులను ఆదేశించారు.

చేపట్టిన ప్రధాన అభివృద్ధి పనుల వివరాలు

* రూ. 1.66 కోట్లతో పార్కులు & పచ్చదనం: పైలాన్ పార్క్, బందరుకోట ల్యాండ్‌స్కేప్, న్యూ ఏపీ హౌసింగ్ బోర్డ్ కాలనీ పార్క్, స్విమ్మింగ్ పూల్ పార్క్, చిర్కార్తోట రిజర్వాయర్ పరిసరాల్లో వాకింగ్ ట్రాక్‌లు, కొబ్బరితోట మరియు విశ్వబ్రాహ్మణ కాలనీ పార్కులకు ప్రహరీ గోడల నిర్మాణం.
* రూ. 1.17 కోట్లతో శ్మశాన వాటికలు & మైనార్టీ స్థలాల అభివృద్ధి: పెద్ద ఉల్లినిగిపాలెం, జవ్వారుపేట, దర్గా ఖబరస్థాన్, మస్జిద్-ఎ-మీరాన్ ఖబరస్థాన్‌లలో రహదారులు మరియు ప్రహరీ గోడల నిర్మాణం.
* రూ. 1.18 కోట్లతో వీధి దీపాలు: బందరుకోట రోడ్డు, న్యూ హెచ్‌‌బీ కాలనీ జంక్షన్, 3 పిల్లర్ సెంటర్ నుంచి ఎంఎంసీ డంపింగ్ యార్డ్ వరకు ఆధునిక విద్యుత్ దీపాలు.
* రూ. 1.58 కోట్లతో ఇతర నిర్మాణ పనులు: బాంబే కెనాల్ బేసిన్ సుందరీకరణ, డ్రైవర్స్ కాలనీ, టెంపుల్ కాలనీలలో ఖాళీ స్థలాలకు ప్రహరీలు, చింతచెట్టు సెంటర్‌లో డ్రెయిన్ నిర్మాణం, రైతు బజార్ పార్క్‌లో చిల్డ్రన్ ప్లే ఎక్విప్‌మెంట్ మరియు దూకుడుగా ఉండే శునకాల సంరక్షణకు రూ.37.84 లక్షలతో కెన్నెల్స్ నిర్మాణం.

ఈ కార్యక్రమంలో నగర మున్సిపల్ కమిషనర్ బాపిరాజు, జిల్లా సహకార మార్కెటింగ్ సొసైటీ చైర్మన్ బండి రామకృష్ణ, ఏఎంసీ చైర్మన్ కుంచె దుర్గాప్రసాద్ నాని, మాజీ కార్పొరేషన్ చైర్మన్లు, ప్రజాప్రతినిధులు, కూటమి నాయకులు మరియు నగర ప్రముఖులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.

About Author

SSN