MachilipatnamLocal News
October 22, 2026
జిల్లా

కృష్ణా జిల్లాలో స్థానిక సంస్థల ఎన్నికల సమర శంఖారావం

  • October 21, 2026
  • 1 min read
కృష్ణా జిల్లాలో స్థానిక సంస్థల ఎన్నికల సమర శంఖారావం

 * 26 జడ్పీటీసీ, 352 ఎంపీటీసీ స్థానాలకు పోలింగ్

 * నవంబర్ 3న పోలింగ్.. 5న ఓట్ల లెక్కింపు

 * నేటి నుంచే నామినేషన్ల స్వీకరణ ప్రారంభం

 * వివరాలు వెల్లడించిన కలెక్టర్ డీకే బాలాజి, జిల్లా ఎస్పీ వి. విద్యాసాగర్ నాయుడు

మచిలీపట్నం:

రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు కృష్ణా జిల్లాలో గ్రామీణ, పట్టణ స్థానిక సంస్థల ఎన్నికలను స్వేచ్ఛగా, నిష్పక్షపాతంగా, ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు జిల్లా యంత్రాంగం, పోలీసు శాఖ పూర్తిస్థాయిలో సన్నద్ధమయ్యాయని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ డీకే బాలాజి తెలిపారు. 

బుధవారం సాయంత్రం కలెక్టరేట్ పీజీఆర్‌ఎస్ సమావేశ మందిరంలో జిల్లా ఎస్పీ వి. విద్యాసాగర్ నాయుడుతో కలిసి ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన ఎన్నికల ఏర్పాట్లు, షెడ్యూల్ వివరాలను వెల్లడించారు.

ఎన్నికల షెడ్యూల్ ముఖ్యాంశాలు:

కృష్ణా జిల్లా వ్యాప్తంగా మొత్తం 26 జడ్పీటీసీ, 352 ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు ఒకే దశలో జరగనున్నాయి.

 * నామినేషన్ల స్వీకరణ ప్రారంభం: అక్టోబర్ 21

 * నామినేషన్ల చివరి తేదీ: అక్టోబర్ 23 (సాయంత్రం 5:00 గంటల వరకు)

 * నామినేషన్ల పరిశీలన: అక్టోబర్ 24

 * అప్పీలు దాఖలుకు గడువు: అక్టోబర్ 25 (సాయంత్రం 5:00 గంటల వరకు)

 * అప్పీళ్ల పరిష్కారం: అక్టోబర్ 26

 * ఉపసంహరణ చివరి తేదీ: అక్టోబర్ 27

 * పోలింగ్ తేదీ: నవంబర్ 3

 * ఓట్ల లెక్కింపు: నవంబర్ 5

జడ్పీటీసీ నామినేషన్లను మచిలీపట్నంలోని జిల్లా పరిషత్ కార్యాలయంలో, ఎంపీటీసీ నామినేషన్లను ఆయా మండల కేంద్రాల్లో స్వీకరిస్తారు. ఎంపీటీసీలకు ఆర్‌డీఓలు, జడ్పీటీసీలకు జిల్లా కలెక్టర్ అప్పీలేట్ అథారిటీలుగా వ్యవహరిస్తారు.

జిల్లా యంత్రాంగం పక్కా ఏర్పాట్లు:

 * పోలింగ్ కేంద్రాలు: జిల్లా వ్యాప్తంగా 754 ప్రాంతాల్లో 1,266 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నారు.

 * సిబ్బంది నియామకం: సుమారు 9,115 మంది పోలింగ్ సిబ్బందిని సిద్ధం చేశామని, ఒకట్రెండు రోజుల్లో విధులను కేటాయిస్తామని కలెక్టర్ తెలిపారు.

 * బ్యాలెట్ బాక్సులు: అవసరమైన 2,786 బాక్సులకు గాను ఇప్పటికే 3,000 బ్యాలెట్ బాక్సులను సిద్ధం చేశారు.

 * నిఘా బృందాలు: ఎన్నికల పర్యవేక్షణకు 100 మంది జోనల్ అధికారులు, 170 మంది రూట్ అధికారులు, వ్యయ పర్యవేక్షణకు 27 స్టాటిక్ సర్వైలెన్స్, 27 ఫ్లయింగ్ స్క్వాడ్, 27 వీడియో సర్వైలెన్స్ బృందాలను రంగంలోకి దించారు.

పటిష్ట భద్రత – ఎస్పీ వి. విద్యాసాగర్ నాయుడు స్పష్టం:

జిల్లా ఎస్పీ వి. విద్యాసాగర్ నాయుడు మాట్లాడుతూ, స్థానిక సంస్థల ఎన్నికల భద్రతకు పక్కా ప్రణాళిక రూపొందించామని చెప్పారు.

 * సమస్యాత్మక ప్రాంతాలు: మొత్తం 754 పోలింగ్ ప్రాంతాల్లో 73 ప్రాంతాలను అత్యంత సమస్యాత్మకంగా, 170 ప్రాంతాలను సమస్యాత్మకంగా గుర్తించి ప్రత్యేక భద్రత కల్పిస్తున్నారు.

 * సాంకేతిక పరిజ్ఞానం: డ్రోన్లు, బాడీ వార్న్ కెమెరాలను వినియోగించడంతో పాటు సమస్యాత్మక ప్రాంతాల్లో వీడియోగ్రఫీ నిర్వహిస్తారు.

 * సర్పంచ్ ఎన్నికలు: గ్రామ పంచాయతీ ఎన్నికలను గుడివాడ, ఉయ్యూరు, మచిలీపట్నం ప్రాంతాల్లో మూడు దశల్లో నిర్వహించేందుకు సుమారు 1,400 వార్డులకు భద్రతా ఏర్పాట్లు పూర్తి చేశారు.

సోషల్ మీడియాపై ప్రత్యేక నిఘా – హెచ్చరిక:

ఎన్నికల వేళ ప్రజలు నిర్భయంగా ఓటు హక్కు వినియోగించుకోవాలని ఎస్పీ కోరారు. సోషల్ మీడియాలో నిరాధారమైన వార్తలు, తప్పుడు ప్రచారాలు చేస్తే చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని, అనామకంగా పోస్టులు చేసినా బాధ్యులను గుర్తించి కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు ముగిసేలా ప్రజలు, రాజకీయ పార్టీలు సహకరించాలని విజ్ఞప్తి చేశారు.

About Author

SSN