MachilipatnamLocal News
October 17, 2026
జిల్లా

కృష్ణా జిల్లాలోని 3 మున్సిపాలిటీలకు స్థానిక ఎన్నికలు

  • October 15, 2026
  • 1 min read
కృష్ణా జిల్లాలోని 3 మున్సిపాలిటీలకు స్థానిక ఎన్నికలు

* అక్టోబర్ 16 నుంచి నామినేషన్ల స్వీకరణ – 28న పోలింగ్, 30న లెక్కింపు
* స్వేచ్ఛగా, నిష్పక్షపాతంగా ఎన్నికలు నిర్వహిస్తాం: కలెక్టర్ డీకే బాలాజి

మచిలీపట్నం:

రాష్ట్ర ఎన్నికల సంఘం విడుదల చేసిన షెడ్యూల్ ప్రకారం కృష్ణా జిల్లాలోని మచిలీపట్నం, పెడన, ఉయ్యూరు మున్సిపాలిటీలకు స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించేందుకు జిల్లా యంత్రాంగం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసిందని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ డీకే బాలాజి వెల్లడించారు. గురువారం సాయంత్రం కలెక్టరేట్‌లోని ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. రాష్ట్ర ఎన్నికల సంఘం మార్గదర్శకాలకు అనుగుణంగా ఎన్నికలను స్వేచ్ఛగా, పారదర్శకంగా, నిష్పక్షపాతంగా నిర్వహిస్తామని స్పష్టం చేశారు.
ఎన్నికల పూర్తి పట్టిక:
* నామినేషన్ల స్వీకరణ ప్రారంభం: అక్టోబర్ 16
* నామినేషన్లకు చివరి తేదీ: అక్టోబర్ 18
* నామినేషన్ల పరిశీలన: అక్టోబర్ 19
* నామినేషన్ల ఉపసంహరణ: అక్టోబర్ 21 (అదే రోజు పోటీలో ఉండే అభ్యర్థుల తుది జాబితా విడుదల)
* పోలింగ్ తేదీ: అక్టోబర్ 28
* ఓట్ల లెక్కింపు: అక్టోబర్ 30

నామినేషన్ల స్వీకరణకు ప్రత్యేక ఏర్పాట్లు:

ప్రతి మున్సిపాలిటీలో వార్డుల వారీగా నియమించిన ఎన్నికల అధికారుల వివరాలు, నామినేషన్లు స్వీకరించే ప్రదేశాలు, కార్యాలయాల వివరాలను ప్రజలకు స్పష్టంగా తెలియజేయాలని సంబంధిత మున్సిపల్ కమిషనర్లను కలెక్టర్ ఆదేశించారు. అభ్యర్థులు ఎన్నికల నోటీసులో పేర్కొన్న తేదీ, సమయం, ప్రదేశాల్లోనే నామినేషన్లు దాఖలు చేయాలని, గడువు విషయంలో ఎలాంటి మినహాయింపు ఉండదని స్పష్టం చేశారు.

ఎన్నికల నియమావళి అమలు:

ఎన్నికల ప్రకటన వెలువడటంతో సంబంధిత మూడు పట్టణ స్థానిక సంస్థల పరిధిలో ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమల్లోకి వచ్చిందని కలెక్టర్ తెలిపారు. సిబ్బంది శిక్షణ, ఎన్నికల సామగ్రి సమీకరణ ప్రక్రియలు పూర్తి చేశామన్నారు. ఎన్నికల విధులు నిర్వర్తించే సిబ్బంది నిబంధనలను ఖచ్చితంగా పాటించాలని సూచించారు.

ఈ సమావేశంలో జిల్లా రెవెన్యూ అధికారి కే. శ్రీధర్ రెడ్డి, జిల్లా సమాచార పౌర సంబంధాల అధికారి పి. జయరావు, ఎన్నికల విభాగం అధికారులు పాల్గొన్నారు.

About Author

SSN