మంగినపూడి బీచ్లో పారిశుద్ధ్య కార్యక్రమం: సముద్ర తీరాన్ని శుభ్రం చేసిన మంత్రి కొల్లు రవీంద్ర
మచిలీపట్నం:
మంగినపూడి బీచ్ను సుందరంగా, పరిశుభ్రంగా ఉంచేందుకు ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలని రాష్ట్ర గనులు, భూగర్భవనరులు, ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర పిలుపునిచ్చారు. వినాయక నిమజ్జన మహోత్సవాల అనంతరం మంగినపూడి సముద్ర తీరంలో పేరుకుపోయిన వ్యర్థాలను తొలగించేందుకు సోమవారం ఉదయం ఆయన స్వయంగా పారిశుద్ధ్య కార్యక్రమంలో పాల్గొన్నారు. పారిశుద్ధ్య సిబ్బంది, స్వచ్ఛంద కార్యకర్తలు మరియు స్థానిక ప్రజలతో కలిసి మంత్రి ప్లాస్టిక్, నీటిలో వేసిన వస్త్రాలు, ఇతర వ్యర్థాలను ఏరివేసి తీరాన్ని శుభ్రం చేశారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, వినాయక నిమజ్జనం సందర్భంగా భారీగా తరలివచ్చిన భక్తుల వల్ల బీచ్ పరిసరాల్లో వ్యర్థాలు పేరుకుపోయాయని, వాటిని తొలగించి బీచ్ ఫ్రంట్ను పునరుద్ధరిస్తున్నామని తెలిపారు. సముద్రంలో ప్లాస్టిక్, పూజా సామగ్రి, విగ్రహాలు, ప్రమిదలు వేయడం వల్ల సముద్ర జీవరాశులకు ప్రమాదమని, అంతేకాక స్నానాలకు వచ్చే పర్యాటకులకు ఇబ్బందులు ఎదురవుతాయని పేర్కొన్నారు. కాబట్టి సందర్శకులు చెత్తను నిర్దేశిత చెత్త బుట్టల్లోనే వేయాలని విజ్ఞప్తి చేశారు.
ఈ పారిశుద్ధ్య యజ్ఞంలో భాగస్వాములైన సిబ్బందిని, స్వచ్ఛంద కార్యకర్తలను మంత్రి అభినందించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ పబ్లిక్ హెల్త్ ఆఫీసర్ సుబ్రహ్మణ్యం, మచిలీపట్నం ఏఎంసీ చైర్మన్ కుంచె దుర్గాప్రసాద్ నాని, మాజీ మున్సిపల్ చైర్మన్ మోటమర్రి బాబా ప్రసాద్, స్థానిక నాయకులు మరియు ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

