MachilipatnamLocal News
October 17, 2026
మచిలీపట్నం

నేతాజీ మిత్రమండలి ఆధ్వర్యంలో ఘనంగా లోక్ నాయక్ జయప్రకాష్ నారాయణ జయంతి

  • October 11, 2026
  • 1 min read
నేతాజీ మిత్రమండలి ఆధ్వర్యంలో ఘనంగా లోక్ నాయక్ జయప్రకాష్ నారాయణ జయంతి

మచిలీపట్నం:

స్థానిక గొడుగుపేట వెంకటేశ్వర కాంప్లెక్స్‌లోని కూనపరెడ్డి ట్రస్ట్‌లో నేతాజీ మిత్రమండలి ఆధ్వర్యంలో ‘లోక్ నాయక్’ జయప్రకాష్ నారాయణ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సంస్థ కో-కన్వీనర్ ధూళిపాళ శ్రీరామచంద్రమూర్తి మరియు ఇతర వక్తలు మాట్లాడుతూ జయప్రకాష్ నారాయణ దేశంలో గొప్ప సామాజిక సేవకునిగా, స్వాతంత్ర్య సమరయోధునిగా విశేష పేరుప్రఖ్యాతులు పొందారని కొనియాడారు.

పూర్వం బీహార్‌లో తీవ్ర కరువు పరిస్థితులు ఏర్పడినప్పుడు తన సేవా సంస్థ ద్వారా బియ్యాన్ని సేకరించి, గంజి కేంద్రాలను నడిపి ప్రజల ప్రాణాలను కాపాడిన మహా వ్యక్తి జయప్రకాష్ నారాయణ అని వక్తలు స్మరించుకున్నారు. అలాగే చెంబల్ లోయలోని భయంకరమైన బందిపోటు దొంగలలో మార్పు తీసుకువచ్చి, వారిని జాతీయ జీవన స్రవంతిలోకి తీసుకువచ్చిన గొప్ప కార్యదక్షుడని ప్రశంసించారు.

నెహ్రూ కుటుంబానికి అత్యంత ఆప్తుడైనప్పటికీ, అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ నియంతృత్వ పోకడలను వలదని హెచ్చరించిన నిజమైన దేశభక్తుడు జేపీ అని కొనియాడారు. అలహాబాద్ హైకోర్టు ప్రధాని ఇందిరాగాంధీ ఎన్నిక చెల్లదని తీర్పు ఇచ్చినప్పుడు, తన అధికారాన్ని వదులుకోవడానికి ఇష్టపడక దేశంలో ఎమర్జెన్సీ విధించి, లక్షమందికి పైగా రాజకీయ నాయకులు మరియు కార్యకర్తలను జైలులో బంధించారని గుర్తుచేశారు. అనంతరం తనకు అనుకూలమైన వాతావరణం ఉందనే ఉద్దేశంతో 1977లో ఎన్నికలు నిర్వహించగా, కేవలం నాలుగు వారాల స్వల్ప వ్యవధిలోనే భారతీయ జనసంఘ్, పాత కాంగ్రెస్, సోషలిస్టులను కలిపి దేశ శ్రేయస్సు కోసం ‘జనతా పార్టీ’ని ఏర్పాటు చేసిన గొప్ప దేశ శ్రేయోభిలాషి ఆయన అని చెప్పారు. ఆ తర్వాత జరిగిన ఎన్నికల్లో జనతా పార్టీ ఘన విజయం సాధించగా, కాంగ్రెస్ చిత్తుగా ఓటమి పాలైందని వివరించారు.

దేశ ప్రజలకు ఆయన ఆదర్శాలు, సేవా తత్పరత, త్యాగశీలత ఎల్లప్పుడూ స్ఫూర్తినిస్తాయని ధూళిపాళ శ్రీరామచంద్రమూర్తి పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో నేతాజీ మిత్రమండలి సభ్యులు బొడ్డు నాగరాజు, జొన్నలగడ్డ సుబ్రహ్మణ్యం, వెన్నా నాగ ఫణిరాజు, విన్నకోట సుబ్బారావు, వేదాంతం గిరిధర్, శంకర్, శివయ్య తదితరులు పాల్గొన్నారు.

About Author

SSN