MachilipatnamLocal News
October 17, 2026
మచిలీపట్నం

దేశ ప్రజల సమైక్యత కోసమే భారత్ వికాస్ పరిషత్: జాతీయ సేవా కన్వీనర్ షా రూప్ చంద్ జైన్

  • September 30, 2026
  • 1 min read
దేశ ప్రజల సమైక్యత కోసమే భారత్ వికాస్ పరిషత్: జాతీయ సేవా కన్వీనర్ షా రూప్ చంద్ జైన్

మచిలీపట్నం:

ప్రపంచ దేశాల సరసన భారతదేశం ఎంతో ఉన్నత స్థానంలో నిలిచిందని భారత్ వికాస్ పరిషత్ జాతీయ సేవా కన్వీనర్ షా రూప్ చంద్ జైన్ పేర్కొన్నారు. బుధవారం మచిలీపట్నం జగన్నాథపురంలోని ఎస్.ఎస్.ఆర్ డిగ్రీ కళాశాలలో భారత్ వికాస్ పరిషత్ మచిలీపట్నం శాఖ సమావేశం ఘనంగా జరిగింది.

ఈ సందర్భంగా ముఖ్యఅతిథిగా విచ్చేసిన షా రూప్ చంద్ జైన్ మాట్లాడుతూ… దేశంలో ఐక్యతను, సమైక్యతను పెంపొందించడానికి నిరంతరం లక్షలాది మంది సభ్యులు శ్రమిస్తున్నారని తెలిపారు. మచిలీపట్నం, పెడన పరిసర ప్రాంతాల విద్యార్థిని విద్యార్థులకు దేశభక్తిపై పోటీలు నిర్వహించి, 200 మందికి బహుమతులు అందజేయడం అభినందనీయమని కొనియాడారు.

కార్యక్రమంలో పాల్గొన్న మచిలీపట్నం బార్ అసోసియేషన్ మాజీ అధ్యక్షులు, ప్రముఖ న్యాయవాది లంకిశెట్టి బాలాజీ మాట్లాడుతూ… విద్యార్థులు చట్టాలపై అవగాహన పెంచుకోవాలని సూచించారు. ప్రస్తుత సామాజిక పరిస్థితుల్లో నైతిక విలువలతో కూడిన విద్య ఎంతో అవసరమని అన్నారు. పిల్లలను టీవీలు, సెల్ ఫోన్లకు దూరంగా ఉంచుతూ తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు వారి పట్ల ప్రత్యేక మెలకువ వహించాలని, విద్యార్థులు సరైన దిశానిర్దేశంతో ముందుకెళ్లాలని పిలుపునిచ్చారు.

దేశ సమగ్ర అభివృద్ధిలో భారత్ వికాస్ పరిషత్ భాగస్వామ్యం కావడం ఆనందదాయకమని సంస్థ నైతిక విలువల కమిటీ చైర్మన్ వి. హనుమంతరావు అన్నారు. సంస్థ ఉపాధ్యక్షులు కొత్తగుండు రమేష్, కార్యదర్శి వి. నాగప్రవీణ్ మాట్లాడుతూ… భారత్ వికాస్ పరిషత్ ఆధ్వర్యంలో పదివేల మందితో ‘వందేమాతరం’ అలపించడం, ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలకు చెందిన 200 మంది విద్యార్థులకు బహుమతులు ప్రధానం చేయడం జరిగిందని వివరించారు.

ఈ కార్యక్రమంలో సంస్థ కోశాధికారి వి.వి. రమణ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పాఠశాలల సంఘం ఉపాధ్యక్షులు స్వామి, మాదిరెడ్డి బాబా, పలు పాఠశాలల ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు మరియు పెద్ద సంఖ్యలో విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.

About Author

SSN