కాంగ్రెస్లో చేరిన జనసేన నాయకులకు మచిలీపట్నంలో ఘన సత్కారం
మచిలీపట్నం:
విజయవాడలో పిసిసి అధ్యక్షురాలు వైఎస్ షర్మిలా రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరిన మచిలీపట్నం జనసేన నాయకులు, కార్యకర్తలకు స్థానిక పట్టాభి భవనంలోని నగర కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో అభినందన కార్యక్రమం నిర్వహించారు. మచిలీపట్నం నగర కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు అబ్దుల్ మతీన్, రాష్ట్ర ఓబీసీ సెల్ చైర్మన్ శొంఠి నాగరాజుల ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో పార్టీలో చేరిన 30 మంది నాయకులకు కండువాలు, శాలువాలతో ఘనంగా సత్కరించారు.
ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూ.. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో మచిలీపట్నంలోని 60 డివిజన్లలో కాంగ్రెస్ అభ్యర్థులు కార్పొరేటర్లుగా పోటీ చేస్తారని స్పష్టం చేశారు. అలాగే మేయర్ స్థానానికి రిజర్వేషన్ ప్రకారం బలమైన అభ్యర్థిని బరిలోకి దింపుతామని వెల్లడించారు.
కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్న వారిలో షేక్ చిన్న బాజీ, ఎండి హమీద్, పుప్పాల సాయి, షేక్ రబ్బాని, నాడ మాధవరావు, ఎండి బాజీ తదితరులు ఉన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ సీనియర్ నాయకులు రజియా సుల్తానా, షేక్ అయ్యూబ్, అఖ్తర్ జమాని బేగం, జన్ను వెంకటేశ్వరావు, నల్లబోలు శామ్యూల్ మరియు పలువురు కార్యకర్తలు పాల్గొన్నారు.

