బోగస్ మరణధృవీకరణ పత్రం మంజూరు చేసిన అధికారులపై తీసుకున్న చర్యలేంటి?
ఉయ్యూరు ఆర్.డి.ఓ.ను నివేదిక కోరిన రాష్ట్ర ఉపలోకాయుక్త జస్టిస్ పి. రజని
ఉయ్యూరు:
కర్ణాటక రాష్ట్రం, బళ్లారి జిల్లా, కౌల్ బజార్/హౌస్ పేట మున్సిపాలిటీ పరిధిలో 14.01.1993న పామర్తి లక్ష్మీపతి మరణించగా, పమిడిముక్కల మండలం, వీరంకి గ్రామంలో 22.03.1994న మరణించినట్లు బోగస్ మరణ ధృవీకరణ పత్రం మంజూరు చేయడంపై వివాదం నెలకొంది. ఈ ఉదంతంలో పమిడిముక్కల మండల తహశీల్దార్ జి.మహేశ్వరరావు మరియు ఇతర అధికారులపై తీసుకున్న క్రమశిక్షణా చర్యల వివరాలతో కూడిన నివేదికను సమర్పించాలని ఉయ్యూరు రెవిన్యూ డివిజన్ అధికారి (RDO) ని ఆదేశిస్తూ రాష్ట్ర ఉపలోకాయుక్త జస్టిస్ పి. రజని ఉత్తర్వులు జారీ చేశారు (కేసు నెంబర్: 1955/2026/లోక్/బి2).
ఈ వ్యవహారంపై రాష్ట్ర రెవిన్యూ శాఖ ముఖ్యకార్యదర్శి, రాష్ట్ర రెవిన్యూ శాఖామాత్యులను 15.12.2025న కలసి ఫిర్యాదు చేసినప్పటికీ సరైన చర్యలు తీసుకోకపోవడంతో సామాజిక కార్యకర్తలు జంపాన శ్రీనివాస గౌడ్, బేతపూడి జోగేశ్వరరావు రాష్ట్ర ఉపలోకాయుక్తను ఆశ్రయించారు. ఈ బోగస్ మరణ ధృవీకరణ పత్రం మంజూరు చేయడంలో నాటి పంచాయతీ కార్యదర్శి వి. ప్రభుకుమార్ కీలక పాత్ర వహించారని, అసలు మరణ ధృవీకరణ పత్రం కర్ణాటకలోని బళ్లారి జిల్లా హౌస్ పేట మున్సిపాలిటీలో 14.01.1993నే నమోదైనట్లు వారు వెల్లడించారు.

