MachilipatnamLocal News
October 22, 2026
పోలీస్ & లీగల్ డైరీ

పోలీస్ అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయం: జిల్లా కలెక్టర్ డీకే బాలాజి

  • October 21, 2026
  • 0 min read
పోలీస్ అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయం: జిల్లా కలెక్టర్ డీకే బాలాజి

మచిలీపట్నం :

విధి నిర్వహణలో ప్రజల రక్షణ కోసం ప్రాణాలర్పించిన పోలీస్ అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయమని, వారి సేవలు సమాజానికి ఎల్లప్పుడూ స్ఫూర్తిదాయకమని జిల్లా కలెక్టర్ డీకే బాలాజి పేర్కొన్నారు. బుధవారం మచిలీపట్నం పోలీస్ పెరేడ్ మైదానంలో నిర్వహించిన ‘పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవం’లో జిల్లా ఎస్పీ వి. విద్యాసాగర్ నాయుడుతో కలిసి కలెక్టర్ పాల్గొని అమరవీరుల స్మారక స్థూపం వద్ద ఘనంగా నివాళులర్పించారు.

అభివృద్ధికి శాంతిభద్రతలే మూలాధారం

ఈ సందర్భంగా కలెక్టర్ డీకే బాలాజి మాట్లాడుతూ… దేశం, రాష్ట్రం ప్రగతి పథంలో పయనించాలంటే పటిష్టమైన శాంతిభద్రతలు అత్యంత కీలకమని స్పష్టం చేశారు. శాంతియుత వాతావరణం ఉన్నప్పుడే పెట్టుబడులు వచ్చి అభివృద్ధికి కొత్త అవకాశాలు లభిస్తాయని, ఈ ప్రక్రియలో పోలీసుల పాత్ర ప్రశంసనీయమని కొనియాడారు.

సిబ్బంది కొరత ఉన్నప్పటికీ వరుస పండుగలు, ప్రోటోకాల్ విధులు, మున్సిపల్ మరియు స్థానిక సంస్థల ఎన్నికల సమయాల్లో పోలీసులు అహర్నిశలు శ్రమిస్తున్నారని కలెక్టర్ అభినందించారు. సొంత సెలవులు, విశ్రాంతిని పక్కనబెట్టి ప్రజల భద్రత కోసం నిరంతరం శ్రమిస్తున్న పోలీసు సిబ్బందికి ప్రభుత్వం మరియు ప్రజల తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.

అమరుల త్యాగం భావి తరాలకు పునాది: ఎస్పీ వి. విద్యాసాగర్ నాయుడు

జిల్లా ఎస్పీ వి. విద్యాసాగర్ నాయుడు మాట్లాడుతూ… పగలు, రాత్రి అనే తేడా లేకుండా పండుగలు, పర్వదినాల్లోనూ కుటుంబాలకు దూరంగా ఉంటూ రోడ్లపై విధులు నిర్వర్తించే ప్రతి పోలీసు సేవ అభినందనీయమని అన్నారు. విధి నిర్వహణలో అమరులైన పోలీసుల త్యాగాలు భావి తరాల భవిష్యత్తు నిర్మాణానికి బలమైన పునాదులుగా నిలుస్తాయని పేర్కొన్నారు.

ఈ సంస్మరణ కార్యక్రమంలో అదనపు ఎస్పీ వి.వి. నాయుడు, బందరు డీఎస్పీ ఆవుల శ్రీనివాసరావుతో పాటు పలువురు పోలీస్ అధికారులు, సిబ్బంది పెద్ద సంఖ్యలో పాల్గొని అమరవీరులకు నివాళులర్పించారు.

About Author

SSN