MachilipatnamLocal News
September 5, 2026
మచిలీపట్నం

వైభవంగా సామూహిక వరలక్ష్మీ వ్రతం.!

  • August 25, 2026
  • 1 min read
వైభవంగా సామూహిక వరలక్ష్మీ వ్రతం.!

భక్తిశ్రద్ధలతో శ్రావణ మంగళ గౌరీ వ్రతం

గౌరీదేవి అనుగ్రహంతో సుఖసంతోషాలు, సౌభాగ్యం కలుగుతాయి – స్థానాచార్యులు శశికాంత్

మచిలీపట్నం:

శ్రావణమాసం సందర్భంగా స్థానిక బచ్చుపేట శ్రీ భూ సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో మంగళవారం శ్రావణ మంగళ గౌరీ, సామూహిక వరలక్ష్మీ వ్రతాన్ని వైభవోపేతంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో 1,008 మందికి పైగా మహిళలు, ముత్తైదువులు భక్తిశ్రద్ధలతో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. దేవస్థానం ఆధ్వర్యంలో ఎటువంటి ప్రవేశ రుసుము లేకుండా ఉచితంగా ఈ వ్రతాన్ని నిర్వహించడం పట్ల భక్తులు హర్షం వ్యక్తం చేశారు.

నియమనిష్ఠలతో పూజా కార్యక్రమం

వ్రతంలో పాల్గొన్న మహిళలు ముందుగానే దేవస్థానం కార్యాలయంలో తమ పేర్లను నమోదు చేసుకున్నారు. పూజా కార్యక్రమానికి హాజరైన మహిళలు కలశపాత్ర, ఉద్ధరణి, గంట, హారతి పళ్లెం తదితర పూజా సామగ్రిని వెంట తెచ్చుకున్నారు. దేవస్థానం అందించిన పూజా ద్రవ్యాలతో కలశస్థాపన, గౌరీదేవి ఆవాహన, సంకల్పం, పసుపు కుంకుమలతో అర్చన, పుష్పార్చన, మంగళహారతి తదితర పూజా విధానాలను భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. అనంతరం వ్రతకథను శ్రద్ధగా ఆలకిస్తూ ముత్తైదువులు సౌభాగ్యం, కుటుంబ శ్రేయస్సు, ఆయురారోగ్యాలను ఆకాంక్షిస్తూ గౌరీ దేవిని ప్రార్థించారు. సుమారు రెండు గంటలకు పైగా దేవస్థాన స్థానాచార్యులు ముత్తేవి శ్రీనివాస శశికాంత్ పూజా విధానాలను వివరిస్తూ మహిళలతో మంగళ గౌరీ వ్రతాన్ని నియమనిష్ఠలతో ఆచరింపజేశారు.

గౌరీదేవి అనుగ్రహంతో సౌభాగ్యం

శ్రావణమాసంలో మంగళ, శుక్రవారాల్లో గౌరీదేవిని భక్తిశ్రద్ధలతో ఆరాధించడం ద్వారా విశేష పుణ్యఫలాలు లభిస్తాయని స్థానాచార్యులు ముత్తేవి శ్రీనివాస శశికాంత్ తెలిపారు. గౌరీదేవి అనుగ్రహంతో వరలక్ష్మీ మాత కృప లభించి కుటుంబంలో సుఖసంతోషాలు, సౌభాగ్యం, ఐశ్వర్యం, కలుగుతాయని పేర్కొన్నారు. ముత్తైదువులు మంగళ గౌరీ వ్రతాన్ని భక్తిశ్రద్ధలతో ఆచరించడం వల్ల దాంపత్య జీవితం సుఖసంతోషాలతో సాగుతుందని, కుటుంబ శ్రేయస్సు, ఆయురారోగ్యాలు సిద్ధిస్తాయని వివరించారు.

ఈ కార్యక్రమంలో దేవస్థాన చైర్మన్, వంశపారంపర్య ధర్మకర్త ముత్తెవి రవికాంత్, దేవస్థానం ఈవో గోవాడ వెంకట కృష్ణారావు, ధర్మకర్తల మండలి సభ్యులు అయినంపూడి రాజశేఖర్, తాడేపల్లి హరి గోపాలరావు, తోట లక్ష్మీకుమారి, మంత్రి లావణ్య తదితరులు పాల్గొన్నారు. కార్యక్రమం అనంతరం భక్తులకు, సువాసినులకు దేవస్థానం ఆధ్వర్యంలో అన్నప్రసాద వితరణ నిర్వహించారు. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామివారి, అమ్మవారి దర్శనం చేసుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు.

About Author

SSN