MachilipatnamLocal News
July 19, 2026
జిల్లా

మచిలీపట్నం కలెక్టరేట్ ఎదుట ఫ్యాప్టో మహాధర్నా

  • July 14, 2026
  • 1 min read
[addtoany]
మచిలీపట్నం కలెక్టరేట్ ఎదుట ఫ్యాప్టో మహాధర్నా

ఉపాధ్యాయ, ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోరుతూ ఇన్చార్జి డిఆర్ఓ పి పోతురాజు కు వినతిపత్రం

మచిలీపట్నం:

ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యాయ సంఘాల సమాఖ్య (FAPTO) ఆధ్వర్యంలో ఉపాధ్యాయులు, ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోరుతూ మచిలీపట్నంలోని కృష్ణాజిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట మహాధర్నా నిర్వహించారు. జిల్లాలోని వివిధ ఉపాధ్యాయ సంఘాల నాయకులు, ఉపాధ్యాయులు పెద్ద సంఖ్యలో పాల్గొని ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

ఈ సందర్భంగా ఫ్యాప్టో నాయకులు మాట్లాడుతూ గత ప్రభుత్వం అమలు చేసిన 11వ పీఆర్సీ కారణంగా ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లు తీవ్రంగా నష్టపోయారని పేర్కొన్నారు. వెంటనే 12వ వేతన సంఘాన్ని ఏర్పాటు చేసి 30 శాతం మధ్యంతర భృతి (IR) ప్రకటించాలని డిమాండ్ చేశారు. అలాగే నూతన పెన్షన్ విధానం (NPS)ను రద్దు చేసి పాత పెన్షన్ విధానం (OPS)ను పునరుద్ధరించాలని, ఉపాధ్యాయులకు టెట్, ఫ్లైయింగ్ స్క్వాడ్ తదితర అదనపు విధుల నుంచి మినహాయింపు కల్పించాలని కోరారు. పాఠశాలల విలీనాలను పునఃసమీక్షించి ఖాళీ ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేయాలని, పదోన్నతులు, బదిలీలను పారదర్శకంగా నిర్వహించాలని, ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

అదేవిధంగా కాంట్రాక్ట్, అవుట్‌సోర్సింగ్ ఉద్యోగుల సమస్యలను పరిష్కరించాలని, మెడికల్ రీయింబర్స్‌మెంట్, ఈహెచ్‌ఎస్ సేవలను మెరుగుపరచాలని, ఉద్యోగులపై పెండింగ్‌లో ఉన్న క్రమశిక్షణ చర్యలను ఉపసంహరించాలని కోరుతూ జిల్లా యంత్రాంగానికి వినతిపత్రం సమర్పించారు. ధర్నాలో ఫ్యాప్టో జిల్లా చైర్మన్ ఎల్. సాయి శ్రీనివాస్, జిల్లా సెక్రటరీ ఎస్. చిరంజీవి, కో-చైర్మన్ కే. నరహరి, చిట్టేటి రమేష్, చందోలు వెంకటేశ్వర్లు, కే. ప్రకాశ్‌రావు, డిప్యూటీ సెక్రటరీ జనరల్ ఎన్. వెంకటేశ్వర్లు, కే. బసవలింగరావు, గుత్తా శ్రీనివాసరావు, కోశాధికారి చింతల సుబ్బారావు, కార్యదర్శి సయ్యద్ ఇక్బాల్, డి. మధుసూదన్‌రావు, ఎం. ప్రవీణ్ కిరణ్తో పాటు వివిధ ఉపాధ్యాయ సంఘాల నాయకులు, ఉపాధ్యాయులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

About Author

SSN