యూట్యూబర్ ప్రశ్న రావణ్ ను అదుపులోకి తీసుకున్న ఇనుకుదురుపేట పోలీసులు
మచిలీపట్నం:
యూట్యూబర్ బచ్చలకూరి జోసెఫ్ అలియాస్ ప్రశ్న రావణ్‌ను ఇనుకుదురుపేట పోలీసులు అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌పై అనుచిత వ్యాఖ్యలు చేశారనే ఆరోపణలపై జనసేన కార్యకర్తలు పలు ప్రాంతాల్లో చేసిన ఫిర్యాదుల మేరకు నమోదైన కేసుల నేపథ్యంలో ఈ చర్య చేపట్టారు. ఇప్పటికే ఇదే కేసుకు సంబంధించి హైదరాబాద్ నుంచి పిఠాపురానికి తరలించిన పోలీసు అధికారులు ఆయనను కోర్టులో హాజరుపరచగా బెయిల్ మంజూరైంది. అనంతరం మచిలీపట్నం ఇనుకుదురుపేట పోలీస్ స్టేషన్‌లో నమోదైన కేసు విచారణ కోసం స్థానిక పోలీసులు రావణ్‌ను మచిలీపట్నానికి తీసుకువచ్చారు.
రావణ్ పోలీస్ స్టేషన్‌కు చేరుకున్న విషయం తెలిసిన జనసేన కార్యకర్తలు పెద్ద సంఖ్యలో అక్కడికి చేరుకోవడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. రావణ్‌పై దాడి జరిగే అవకాశం ఉందనే సమాచారంతో పోలీసులు ఆయనకు కట్టుదిట్టమైన భద్రత కల్పించారు. పోలీస్ స్టేషన్ వద్ద మూడంచెల భద్రత ఏర్పాటు చేసి, భారీ బందోబస్తు నిర్వహించారు.
ఈ సందర్భంగా కొందరు కార్యకర్తలు పోలీసులు ఏర్పాటు చేసిన బ్యారికేడ్లను దాటి రావణ్ వద్దకు వెళ్లేందుకు ప్రయత్నించగా, పోలీసులు వారిని అడ్డుకున్నారు. మరికొందరు పోలీస్ స్టేషన్ ప్రహరీ గోడ దూకి లోపలికి వెళ్లేందుకు యత్నించడంతో పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చారు. మచిలీపట్నం ఇనుకుదురుపేట పోలీస్ స్టేషన్‌లో నమోదైన కేసులో ప్రశ్న రావణ్‌ను ప్రభుత్వ ఆసుపత్రిలో మెడికల్ పరీక్షలు నిర్వహించారు. ఈ ఘటనతో పోలీస్ స్టేషన్ పరిసరాల్లో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తు చర్యలో భాగంగా చిలకలపూడి సర్కిల్ ఇన్స్పెక్టర్ నబి, ఇనకుదురు పేట సర్కిల్ ఇన్స్పెక్టర్ పరమేశ్వర రావు, భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.

