MachilipatnamLocal News
September 5, 2026
పోలీస్ & లీగల్ డైరీ

కోనేరు సెంటర్‌లో రోడ్డు భద్రతపై అవగాహన

  • June 17, 2026
  • 0 min read
కోనేరు సెంటర్‌లో రోడ్డు భద్రతపై అవగాహన

మచిలీపట్నం:

రోడ్డు ప్రమాదాల నివారణ మరియు హెల్మెట్ వినియోగాన్ని ప్రోత్సహించే లక్ష్యంతో మచిలీపట్నంలోని కోనేరు సెంటర్ వద్ద బుధవారం ట్రాఫిక్ పోలీసులు అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు.కృష్ణా జిల్లా ఎస్పీ వి. విద్యాసాగర్ నాయుడు, ఆదేశాల మేరకు, బందరు సబ్ డివిజన్ ఇంచార్జి డీఎస్పీ జి. శ్రీనివాసరావు ఆధ్వర్యంలో, బందరు ట్రాఫిక్ సీఐ నున్నా రాజు ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రజలు, ఆటో డ్రైవర్లు, వాహనదారులకు రోడ్డు భద్రతా నియమాల ప్రాముఖ్యతను వివరించారు. ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని, వాహనం నడుపుతూ సెల్‌ఫోన్ ఉపయోగించరాదని, మద్యం సేవించి వాహనాలు నడపడం ప్రమాదకరమని సూచించారు. అలాగే అతివేగం రోడ్డు ప్రమాదాలకు ప్రధాన కారణమవుతుందని హెచ్చరించారు.

ఆటో డ్రైవర్లు ట్రాఫిక్ నియమాలను కచ్చితంగా పాటించాలని, అధిక సంఖ్యలో ప్రయాణికులను ఎక్కించరాదని, ప్రయాణికుల భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. రోడ్డు ప్రమాదాల నివారణలో ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా వ్యవహరించాలని కోరారు.ఈ కార్యక్రమంలో ట్రాఫిక్ ఎస్‌ఐలు, ట్రాఫిక్ పోలీసు సిబ్బంది పాల్గొని ప్రజలకు రోడ్డు భద్రతపై అవగాహన కల్పించారు.

About Author

SSN